Anupama Parameswaran: అనుపమ సినిమా వివాదానికి తెర.. వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డు

Anupama Parameswaran Janaki Movie Censor Board Backs Down After Controversy
  • అనుపమ 'జానకి' సినిమా వివాదానికి ముగింపు
  • 96 కట్స్ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న సెన్సార్ బోర్డు
  • కేవలం రెండు చిన్న మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచన
  • హైకోర్టును ఆశ్రయించడంతో దిగొచ్చిన సెన్సార్ అధికారులు
  • టైటిల్‌తో పాటు ఒక సన్నివేశంలో పేరు మ్యూట్ చేయాలని కోరిన బోర్డు
నటి అనుపమ పరమేశ్వరన్‌, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రానికి సంబంధించిన సెన్సార్ వివాదం కొలిక్కి వచ్చింది. ఈ సినిమాకు తొలుత 96 కట్స్ విధించాలని సూచించిన సెన్సార్ బోర్డు తాజాగా వెనక్కి తగ్గింది. రెండు చిన్న మార్పులు చేస్తే సరిపోతుందని కేరళ హైకోర్టుకు స్పష్టం చేసింది. చిత్ర నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ వివాదంపై కేరళ హైకోర్టులో జరిగిన విచారణలో సెన్సార్ బోర్డు తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. సినిమా టైటిల్‌లో హీరోయిన్ పేరును ప్రతిబింబించేలా 'వి. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' లేదా 'జానకి వి. వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా మార్చాలని సూచించారు. దీంతోపాటు సినిమాలోని ఒక కోర్టు సన్నివేశంలో హీరోయిన్ పేరును మ్యూట్ చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని వివరించారు. బోర్డు వాదనలు విన్న న్యాయస్థానం, ఈ మార్పులపై తమ అభిప్రాయం చెప్పాలని చిత్రబృందాన్ని ఆదేశించింది.

అసలేంటి వివాదం?

ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వంలో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైంగిక దాడికి గురైన బాధితురాలి పాత్ర పేరు 'జానకి'. సీతాదేవి మరో పేరైన జానకిని ఇలాంటి పాత్రకు పెట్టడంపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేరు మార్చడంతో పాటు అనేక కట్స్ విధించాలని సూచించింది. అయితే, సినిమా ప్రకారం పేరు మార్చడం సాధ్యం కాదని, ఇది అనేక మార్పులకు దారితీస్తుందని చిత్రబృందం వాదించింది. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.
Anupama Parameswaran
Janaki Vs State of Kerala
Suresh Gopi
Kerala High Court
Censor Board

More Telugu News