Asaduddin Owaisi: ఒవైసీ కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన

AV Ranganath Response on Not Demolishing Owaisi College
  • పాతబస్తీ సూరం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఒవైసీ ఫాతిమా కాలేజీ
  • 10 వేల మందికి పైగా పేద ముస్లిం యువతులు చదువుకుంటున్నారన్న రంగనాథ్
  • మానవతా దృక్పథంతో కూల్చివేత చర్యలను నిలిపివేశామని వెల్లడి
పాతబస్తీలోని సూరం చెరువు పరిరక్షిత ప్రాంతంలో (ఎఫ్‌టీఎల్‌) ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించిన ఫాతిమా కాలేజీ కూల్చివేతకు సంబంధించి వెల్లువెత్తుతున్న విమర్శలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. సామాన్యుల నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు, ఒవైసీ కాలేజీ విషయంలో ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని వస్తున్న ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు.

ఈ విషయంపై ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ... "ఫాతిమా కాలేజీని ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించినందున గత ఏడాది సెప్టెంబర్‌లోనే కూల్చివేసేందుకు ప్రయత్నించాం. అయితే, ఆ కాలేజీలో 10,000 మందికి పైగా పేద ముస్లిం బాలికలు, యువతులు కేజీ నుంచి పీజీ వరకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారని మా దృష్టికి వచ్చింది" అని తెలిపారు. పేద ముస్లిం మహిళల అభ్యున్నతికి ఈ విద్యాసంస్థ ఎంతో దోహదపడుతోందని ఆయన అన్నారు.

ఒక సామాజిక ప్రయోజనం కోసం నడుస్తున్న సంస్థ కావడంతోనే మానవతా దృక్పథంతో ఆలోచించి కూల్చివేత చర్యలను నిలిపివేశామని రంగనాథ్ వివరించారు. అయితే, ఇతర ఎంఐఎం నేతల అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగానే వ్యవహరించామని ఆయన స్పష్టం చేశారు. "ఇప్పటికే ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన అనేక భారీ నిర్మాణాలను కూల్చివేశాం. సుమారు రూ.1000 కోట్ల విలువైన ఆస్తులను మజ్లిస్ నాయకుల నుంచి స్వాధీనం చేసుకున్నాం. చాంద్రాయణగుట్టలో ఓ ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని కూడా రికవరీ చేశాం" అని ఆయన గుర్తుచేశారు.

కేవలం సామాజిక కారణాలతోనే ఫాతిమా కాలేజీపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నామని, దీన్ని బలహీనతగా చూడవద్దని ఏవీ రంగనాథ్ పరోక్షంగా ప్రస్తావించారు. 
Asaduddin Owaisi
Fatima College
Hyderabad
AV Ranganath
MIM
AIMIM
Old City Hyderabad
encroachments
Telangana news
Fathima College Demolition

More Telugu News