UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు.. యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన

UAE govt dismisses media reports on lifetime Golden Visa as fake news
  • యూఏఈ లైఫ్‌టైమ్ గోల్డెన్ వీసా ఇస్తోందన్న వార్తలను ఖండించిన అధికారులు
  • కొన్ని విదేశీ కన్సల్టెన్సీల తప్పుడు ప్రచారంపై తీవ్ర హెచ్చరిక
  • గోల్డెన్ వీసా దరఖాస్తులు కేవలం అధికారిక మార్గాల్లోనేనని స్పష్టీకరణ
  • వదంతులు వ్యాప్తి చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకటన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచన
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొన్ని దేశాల వారికి 'జీవితకాల గోల్డెన్ వీసా' మంజూరు చేస్తోందంటూ ప్రచారంలో ఉన్న వార్తలను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసీపీ) స్పష్టం చేసింది. యూఏఈలో నివసించాలనే ప్రజల ఆశలను, ఆశయాలను ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు చేస్తున్న మోసపూరిత ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

విదేశాలకు చెందిన ఓ కన్సల్టింగ్ కార్యాలయం, కొన్ని మీడియా సంస్థలు ఈ తప్పుడు వార్తలను ప్రచురించినట్లు ఐసీపీ గుర్తించింది. యూఏఈ ప్రభుత్వంతో సంబంధం లేని ఏ ప్రైవేట్ ఏజెన్సీ లేదా కన్సల్టెన్సీకి గోల్డెన్ వీసా దరఖాస్తులను స్వీకరించే అధికారం లేదని అధికారులు తేల్చిచెప్పారు. గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచించారు.

యూఏఈ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే గోల్డెన్ వీసా కేటగిరీలు, వాటికి ఉండాల్సిన అర్హతలను నిర్ణయిస్తారని ఐసీపీ వివరించింది. రియల్ ఎస్టేట్‌లో 2 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడి పెట్టడం, వ్యాపార యజమానులుగా ఉండటం, లేదా సైన్స్, కళలు, క్రీడలు వంటి రంగాల్లో విశేషమైన ప్రతిభ కనబరచడం వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వం గోల్డెన్ వీసాలను మంజూరు చేస్తుంది. నామినేషన్ల ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా ప్రభుత్వమే పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

కొంత ఫీజు చెల్లిస్తే చాలు, గోల్డెన్ వీసా సులభంగా పొందవచ్చని కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని యూఏఈలో నివసించాలనుకునే, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఐసీపీ విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 600522222 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని కోరింది.
UAE Golden Visa
Golden Visa
UAE
United Arab Emirates
ICP
Dubai Visa
UAE Visa Fraud
Investment Visa
UAE Residency

More Telugu News