Virat Kohli: టెస్టు రిటైర్మెంట్‌పై తొలిసారి పెదవి విప్పిన విరాట్ కోహ్లీ

Virat Kohli Opens Up About Test Retirement
  • టెస్ట్ రిటైర్మెంట్‌పై రెండు నెలల తర్వాత స్పందించిన విరాట్ కోహ్లీ
  • గడ్డానికి రంగు వేసుకోవాల్సి రావడమే కారణమంటూ సరదా వ్యాఖ్య
  • లండన్‌లో యువరాజ్ సింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కింగ్ కోహ్లీ
  • యువరాజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న స్టార్ క్రికెటర్
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌పై దాదాపు రెండు నెలల తర్వాత తొలిసారి స్పందించాడు. రిటైర్మెంట్‌కు గల కారణాన్ని సరదాగా వెల్లడించి అందరినీ నవ్వించాడు. లండన్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన 'యువికెన్ ఫౌండేషన్' కోసం నిర్వహించిన ఓ నిధుల సమీకరణ కార్యక్రమంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమానికి పలువురు క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. వేదికపై యువరాజ్ సింగ్, రవిశాస్త్రి, కెవిన్ పీటర్సన్ వంటి వారితో చేరాల్సిందిగా వ్యాఖ్యాత గౌరవ్ కపూర్ కోరగా విరాట్ నవ్వుతూ స్పందించాడు. "నేను రెండ్రోజుల క్రితమే నా గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి నాలుగు రోజులకోసారి గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తోందంటే ఇక ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి" అంటూ చమత్కరించారు. కోహ్లీ వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

మే 12న కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తన 123 టెస్టుల కెరీర్‌లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. భారత కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచిన ఘనత కూడా కోహ్లీదే. రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న ఐదు రోజులకే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.

ఈ సందర్భంగా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను కోహ్లీ ప్రశంసించాడు. ఇంగ్లండ్‌పై రికార్డు డబుల్ సెంచరీ చేసిన గిల్‌ను ‘స్టార్ బాయ్’ అని అభినందించాడు. అలాగే యువరాజ్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. "భారత జట్టులోకి వచ్చిన కొత్తలో యువరాజ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. యువీతో నా బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనది" అని కోహ్లీ పేర్కొన్నాడు. 
Virat Kohli
Virat Kohli retirement
Yuvraj Singh
YuviCan Foundation
Shubman Gill
Rohit Sharma
Test cricket
Indian cricket team
Gaurav Kapur
Ravi Shastri

More Telugu News