Sabi Khan: యాపిల్‌లో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి... ఎవరీ సబీ ఖాన్?

Indian origin Sabih Khan named Apples new Chief Operating Officer
  • ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త సీఓఓగా సబీ ఖాన్
  • భారత సంతతికి చెందిన వ్యక్తికి కీలక బాధ్యతలు
  • ప్రస్తుత సీఓఓ జెఫ్ విలియమ్స్ స్థానంలో నియామకం
  • యూపీలోని మొరాదాబాద్‌లో జన్మించిన సబీ ఖాన్
  • గత 30 ఏళ్లుగా యాపిల్ సంస్థలో వివిధ హోదాల్లో సేవలు
  • సబీ ఖాన్ సేవలను కొనియాడిన సీఈఓ టిమ్ కుక్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్‌లో భారత సంతతికి చెందిన సబీ ఖాన్ ఉన్నత పదవిని అధిరోహించారు. కంపెనీ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (సీఓఓ) ఆయన నియమితులయ్యారు. దాదాపు 30 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్న సబీ ఖాన్, ప్రస్తుత సీఓఓ జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెలాఖరు నుంచే ఆయన తన కొత్త బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఆపరేషన్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సబీ ఖాన్, కంపెనీలో కీలకమైన గ్లోబల్ సప్లై చైన్‌ను దశాబ్దాలుగా పర్యవేక్షిస్తున్నారు. 2015 నుంచి సీఓఓగా పనిచేస్తున్న జెఫ్ విలియమ్స్, ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. అప్పటివరకు ఆయన యాపిల్ వాచ్, డిజైన్ బృందాలను పర్యవేక్షిస్తూ సీఈఓ టిమ్ కుక్‌కు రిపోర్ట్ చేస్తారని సంస్థ తెలిపింది.

ఎవరీ సబీ ఖాన్?
సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. పాఠశాల విద్య కోసం సింగపూర్‌కు, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన, 1995లో యాపిల్‌లో చేరారు. భారత్‌ను కీలక మార్కెట్‌గా, తయారీ కేంద్రంగా మార్చుకోవాలని యాపిల్ భావిస్తున్న తరుణంలో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

సబీ ఖాన్‌పై టిమ్ కుక్ ప్రశంసలు
ఈ నియామకంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హర్షం వ్యక్తం చేశారు. "సబీ ఒక అద్భుతమైన వ్యూహకర్త. యాపిల్ సప్లై చైన్ రూపకల్పనలో ఆయన పాత్ర ఎంతో కీలకం. అత్యాధునిక తయారీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయన ముందున్నారు" అని టిమ్ కుక్ ప్రశంసించారు.
Sabi Khan
Apple
Tim Cook
Jeff Williams
COO
Chief Operating Officer
Global Supply Chain
Moradabad
India
Technology

More Telugu News