Ramyas murder: పెళ్లికి నిరాకరించడంతోనే ఘాతుకం.. యువతి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Sangareddy Youth Kills Lover After Marriage Rejection
  • నిందితుడు ప్రియుడు ప్రవీణ్‌కుమార్‌గా నిర్ధారణ
  • ప్రియురాలిని చంపి, ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్
తనకు దక్కని ప్రియురాలు మరెవరికీ దక్కకూడదనే కక్షతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, కొద్ది రోజులుగా ఆమె తనను దూరం పెట్టడంతో రగిలిపోయి ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా మాణెపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్ (25), రామచంద్రాపురం బండ్లగూడలో నివసించే డిగ్రీ విద్యార్థిని రమ్య (23) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం ప్రవీణ్ వారి పెళ్లి విషయాన్ని రమ్య తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించగా వారు నిరాకరించారు. అప్పటి నుంచి రమ్య అతడిని దూరం పెడుతూ వస్తోంది. గత వారం రోజులుగా ప్రవీణ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రవీణ్.. రమ్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు పనులకు వెళ్లిన తర్వాత, ఇంటి వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించాడు. రమ్యతో కాసేపు వాగ్వాదానికి దిగి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం అదే కత్తితో తన మెడపై, గుండెలో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అతడి ప్రాణాలకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.

నిందితుడి కుటుంబ నేపథ్యంపై ఆరా తీయగా 20 ఏళ్ల క్రితమే తండ్రి చనిపోయాడని, తల్లి కూడా వీరితో ఉండటం లేదని తెలిసింది. చిన్నతనం నుంచి అమ్మమ్మ వద్ద పెరిగిన ప్రవీణ్, ప్రస్తుతం ఆల్విన్‌కాలనీలో ఉంటూ ట్యూషన్లు చెప్పుకుని జీవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Ramyas murder
Sangareddy crime
Love affair murder
Praveen Kumar
Ramachandrapuram
Telangana crime news
Rejection murder
Youth murder case
Crime news
Student murder

More Telugu News