Hyderabad: హైదరాబాద్‌లో కల్తీ కల్లు కల్లోలం.. 15 మందికి తీవ్ర అస్వస్థత

Hyderabad Toddy Adulteration Causes Uproar 15 Hospitalized
  • హైదరాబాద్‌లో కలకలం రేపిన కల్తీ కల్లు
  • కల్లు తాగి 15 మందికి తీవ్ర అస్వస్థత, ఆసుపత్రిపాలు
  • బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమం
  • కిడ్నీలపై తీవ్ర ప్రభావం.. నిమ్స్‌లో బాధితులకు డయాలసిస్
  • హడావుడిగా మూడు కల్లు దుకాణాలను సీజ్ చేసిన అబ్కారీ శాఖ
హైదరాబాద్‌లో కల్తీ కల్లు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. కలుషితమైన కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన అబ్కారీ అధికారులు పలు కల్లు దుకాణాలను సీజ్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నడిగడ్డతండా ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం ఉదయం స్థానికంగా కల్లు తాగారు. ఆ రోజు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, సోమవారం ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరిగా అనారోగ్య లక్షణాలు బయటపడ్డాయి. బీపీ పడిపోవడం, తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కొందరిలో స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితులను హైదర్‌గూడలోని రాందేవ్‌రావ్‌ ఆసుపత్రికి తరలించారు.

బాధితులకు ఆదివారం నుంచి మూత్రం సరిగా రావడం లేదని, దీనివల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడిందని వైద్యులు గుర్తించారు. రక్తంలో క్రియాటినైన్ స్థాయులు ప్రమాదకరంగా పెరగడంతో మెరుగైన చికిత్స కోసం, డయాలసిస్ నిర్వహించేందుకు వీలుగా వారందరినీ నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో అడ్డగుట్టకు చెందిన ఓదేలు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరెకపూడి గాంధీ, మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఉమ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటన వెలుగులోకి రావడంతో అబ్కారీ అధికారులు మంగళవారం సాయంత్రం హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, శంషీగూడలోని మూడు కల్లు దుకాణాలను హడావుడిగా సీజ్ చేశారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, మరికొందరు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
Hyderabad
Spurious toddy
toddy
Hyderabad
Kukatpally
Ramdev Rao Hospital
NIMS Hospital
Madhavaram Krishna Rao
Arekapudi Gandhi

More Telugu News