Kolusu Parthasarathy: తునిలో 'సుపరిపాలన తొలి అడుగు'.. జగన్‌పై మంత్రి పార్థసారథి ఫైర్

Kolusu Parthasarathy Fires at Jagan Over Governance in Tuni
  • కాకినాడ జిల్లా తునిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం
  • పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే యనమల దివ్య
  • ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి
  • అధికారులకు తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు
  • పరామర్శల పేరుతో జగన్ అరాచకానికి ప్రయత్నిస్తున్నారని విమర్శ
  • రెడ్ బుక్ భయం పాపాలు చేసిన వారికేనని వ్యాఖ్య
రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి అడుగు వేస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. మంగళవారం నాడు కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజల గడప వద్దకే తీసుకువచ్చి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "పరామర్శల పేరుతో జగన్ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించాలని చూస్తున్నారు. 'నరుకుతాం, అడ్డొస్తే తొక్కేస్తాం' వంటి రెచ్చగొట్టే మాటలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు ఈ కుట్రలను గమనించాలి" అని అన్నారు.

'రెడ్ బుక్' వివాదంపై స్పందిస్తూ, "గత ఐదేళ్లలో చేసిన పాపాలు, దోపిడీలు, తప్పులు వారి మనసులో ఉన్నాయి కాబట్టే వైసీపీ నేతలకు రెడ్ బుక్ అంటే భయం పట్టుకుంది. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు కూడా రెడ్ బుక్‌ను రాజ్యాంగంతో పోల్చడం విడ్డూరంగా ఉంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతుంది. మేం గత ప్రభుత్వంలా వ్యవస్థలను ధ్వంసం చేయం. తప్పు చేయని వారు ఎవరికీ, దేనికీ భయపడాల్సిన అవసరం లేదు" అని పార్థసారథి తేల్చిచెప్పారు.

ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మంత్రి పార్థసారథి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం, పట్టణంలోని తారకరామనగర్‌లో ఇంటింటికీ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను ఓపికగా విన్నారు. విద్యుత్తు సరఫరా, కాలువల మరమ్మతులు, ఉచిత గ్యాస్ వంటి పలు అంశాలపై ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ఆయన వెంటనే స్పందించారు. అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి, ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
Kolusu Parthasarathy
Andhra Pradesh
Tuni
Yanamala Divya
TDP
YS Jagan
Red Book controversy
Good Governance
Telugu Desam Party
AP Politics

More Telugu News