Rafale: భారత్ రఫేల్ జెట్ ఫైటర్లను కూల్చేశామన్న పాకిస్థాన్.. స్పందించిన రఫేల్ తయారీ సంస్థ

Rafale Dassault Aviation Denies Pakistan Claim of Downing Rafales
  • ఆపరేషన్ సిందూర్‌లో మూడు రఫేల్స్ కూల్చేశామన్న పాకిస్థాన్
  • పాక్ వాదన పూర్తిగా అవాస్తవమన్న రఫేల్ తయారీ సంస్థ డసో
  • సాంకేతిక లోపంతోనే ఒక రఫేల్ విమానం కూలిపోయిందని స్పష్టత
  • శత్రువుల దాడి జరగలేదని చెప్పిన డసో సీఈవో ఎరిక్ ట్రాపియర్
  • పాక్ వాదన సరికాదన్న భారత రక్షణ కార్యదర్శి ఆర్కే సింగ్
  • ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని వెల్లడి
'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మూడు రఫేల్ యుద్ధ విమానాలను కూల్చివేశామంటూ పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని రఫేల్ తయారీ సంస్థ డసో ఏవియేషన్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కేవలం ఒకే ఒక రఫేల్ విమానాన్ని భారత్ కోల్పోయిందని, అది కూడా శత్రువుల దాడి వల్ల కాదని ఆ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం మే 7న 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో మూడు రఫేల్ యుద్ధ విమానాలతో సహా మొత్తం ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే, తన వాదనకు మద్దతుగా ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్ ఈ విషయంపై స్పందించారు. పాకిస్థాన్ వాదనను ఆయన తోసిపుచ్చారు. "అధిక ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఒక రఫేల్ విమానం కూలిపోయింది. శత్రువుల చర్యల వల్ల కాదని మా స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ డేటా స్పష్టంగా చెబుతోంది. మా విమానాలకు సంబంధించిన నష్టాలను డసో ఏవియేషన్ ఎప్పుడూ దాచిపెట్టదు" అని ఆయన వివరించారు.

ఇదే అంశంపై భారత రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ కూడా స్పందించారు. రఫేల్ విమానాలను కూల్చేశామంటూ పాకిస్థాన్ బహువచన ప్రయోగం చేయడం సరికాదని అన్నారు. "ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణ, ఆస్తి నష్టం పాకిస్థాన్ వైపు చాలా ఎక్కువగా ఉంది. మేం 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం" అని ఆయన తేల్చిచెప్పారు.
Rafale
Dassault Aviation
Eric Trappier
Operation Sindoor
India Pakistan
Indian Air Force

More Telugu News