Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఎయిరిండియా వాదన

Air India CEO addresses Parliamentary Panel on Ahmedabad plane crash
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
  • కూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ సురక్షితమైనదేనన్న ఎయిరిండియా
  • భద్రతా లోపాలపై ఎయిరిండియా అధికారులను ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానెల్
  • ఈ దుర్ఘటనలో 260 మందికి పైగా మృతి చెందినట్లు నిర్ధారణ
దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను మంగళవారం కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. విమాన డేటా, సిబ్బంది చివరి నిమిషాల్లో తీసుకున్న చర్యలు, వాతావరణ పరిస్థితులు వంటి కీలక అంశాలను ఈ నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుతం ఈ నివేదికను అధికారులు బహిర్గతం చేయనప్పటికీ, ఈ వారాంతంలోగా దీనిని విడుదల చేసే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఎయిరిండియా సీఈఓ విల్సన్ క్యాంప్‌బెల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం అత్యంత సురక్షితమైనదని, ఈ మోడల్‌కు చెందిన వెయ్యికి పైగా విమానాలు ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నాయని వారు ప్యానెల్‌కు వివరించారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

అయితే, ఈ సమావేశంలో పలువురు ఎంపీలు విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగు చూసిన లోపాలను ప్రస్తావిస్తూ తక్షణమే ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత విమాన ఛార్జీలను అమాంతం పెంచడాన్ని కూడా వారు వ్యవస్థల వైఫల్యంగా పేర్కొన్నారు.

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా 241 మంది మరణించారు. విమానం సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో, అక్కడివారితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 260 దాటినట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
Air India
Ahmedabad plane crash
Wilson Campbell
AAIB report
Boeing 787 Dreamliner

More Telugu News