Vijay Deverakonda: ఒకప్పుడు చెప్పలేకపోయేవాడిని.. ఇప్పుడు ధైర్యంగా చెబుతున్నాను: విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Now Confidently Rejects Scripts He Dislikes
  • స్క్రిప్ట్‌ల విషయంలో ఇప్పుడు చాలా కఠినంగా ఉంటున్నానన్న విజయ్
  • డబ్బు, అభిమానుల ప్రేమకు గౌరవం ఇవ్వాలంటున్న హీరో
  • 'కింగ్‌డమ్‌' టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్
  • నైతికత కాదనే మరో కథను వదులుకున్నట్లు వెల్లడి
ఒకప్పుడు తనకు నచ్చని స్క్రిప్ట్‌ను కూడా కాదనలేని పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు పూర్తి సంతృప్తి చెందితేనే సినిమా చేస్తున్నానని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. కెరీర్‌లో నేర్చుకున్న అనుభవాలతో స్క్రిప్ట్‌ల ఎంపికలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఆయన హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ‘కింగ్‌డమ్‌’ చిత్రం జులై 31న విడుదల కానున్న సందర్భంగా విజయ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, "గతంలో నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్‌ బాగోలేదని చెప్పడానికి చొరవ ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో కుటుంబ అండ ఉన్న నా సహనటులకు ఆ వెసులుబాటు ఉంటుంది. కథ నచ్చకపోతే వెంటనే చేయనని చెప్పగలరు. కానీ ఇప్పుడు నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. డబ్బు, దర్శకుడి కెరీర్, అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు గౌరవం ఇవ్వాలనే బాధ్యతతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. పూర్తి సంతృప్తి కలిగాకే ముందుకు వెళుతున్నా. ఇన్నేళ్లలో నేను నేర్చుకున్నది ఇదే" అని అన్నారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన వద్దకు రెండు కథలతో రాగా, తాను ‘కింగ్‌డమ్‌’ను ఎంచుకున్నట్లు విజయ్ తెలిపారు. రెండో కథ ఇటీవల విడుదలైన ఓ సినిమాకు దగ్గరగా ఉండటంతో, అది నైతికంగా సరైంది కాదని భావించి వదులుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆ కథతో సినిమా తీసి ఉంటే తామే ముందుగా పూర్తి చేసేవాళ్లమని, కానీ అలా చేయడం సరికాదనిపించిందని వివరించారు.

ఇక టాలీవుడ్‌లో ఒకరికొకరు సాయం చేసుకునే సంస్కృతి ఉందని, తన ‘కింగ్‌డమ్‌’ టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వమని అడగ్గానే ఎన్టీఆర్ వెంటనే అంగీకరించారని విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సహకారంతోనే స్నేహబంధాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు.
Vijay Deverakonda
Kingdom Movie
Gowtam Tinnanuri
Telugu Cinema
Script Selection
NTR Voiceover

More Telugu News