DK Shivakumar: డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయం: మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

DK Shivakumar Likely to be Chief Minister Says Congress MLA
  • కర్ణాటకలో మరోసారి తెరపైకి వచ్చిన ముఖ్యమంత్రి మార్పు అంశం
  • ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను ఇటీవల బహిరంగంగా వెల్లడించిన డీకే శివకుమార్
  • డీకేకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తాజాగా ఎమ్మెల్యే యోగేశ్వర్ వ్యాఖ్య
  • దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు డీకే వైపేనంటూ జోరుగా ప్రచారం
  • నాయకత్వ మార్పు లేదని అధిష్ఠానం చెప్పినా ఆగని వర్గపోరు
అధిష్ఠానం ఎంత సర్దిచెప్పినా కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం సద్దుమణగడం లేదు. నాయకత్వ మార్పు ఉండదని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా గళం విప్పుతుండటంతో ఈ వివాదం మరోసారి భగ్గుమంది. డీకే శివకుమార్ తదుపరి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఆయనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మంగళవారం నాడు యోగేశ్వర్ మాట్లాడుతూ "డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని చాలామంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా ఇదే" అని అన్నారు. అయితే, తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం చేతిలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా.. సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో చర్చలు జరిపి, నాయకత్వ మార్పు ప్రసక్తే లేదని ప్రకటించారు.

అయితే, ఆ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే సోమవారం నాడు డీకే శివకుమార్ స్వయంగా తన మనసులోని మాటను బయటపెట్టారు. "ముఖ్యమంత్రి పదవిని ఆశించడంలో తప్పేముంది?" అని ఆయన ప్రశ్నించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. డీకే వ్యాఖ్యల తదనంతరం ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేలు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
DK Shivakumar
Karnataka Congress
Chief Minister
Siddaramaiah
Congress MLA Yogeshwar

More Telugu News