KTR: కేటీఆర్ ఒక బచ్చా: అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు

KTR is a kid says Addanki Dayakar
  • లక్షల కోట్ల అవినీతితో వచ్చిన అహంకారం కేటీఆర్ ది అన్న అద్దంకి
  • దోపిడీ చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే తప్పేంటని ప్రశ్న
  • ఫోన్ ట్యాపింగ్ లేకపోతే కాంగ్రెస్ కు 100 సీట్లు వచ్చేవని వ్యాఖ్య
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రైతుల సమస్యలు, ప్రభుత్వ హామీలపై చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్.. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సవాల్ మేరకు ఈ ఉదయం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఒక ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి నిరీక్షించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, చర్చలకు అసలైన వేదిక అసెంబ్లీ అని, దమ్ముంటే అక్కడికి రావాలని ప్రతిసవాల్ విసిరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై కనీస అవగాహన లేదని, ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారని విమర్శించారు. "సీఎం సవాల్‌ను స్వీకరించి మేం వస్తే, ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కనీసం మంత్రులనైనా పంపుతారని ఆశించాం. తెలంగాణ నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి. చర్చకు వచ్చే దమ్ములేనప్పుడు సవాళ్లు విసరొద్దు. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ను "ఓ బచ్చా" అని సంబోధిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఆయనకు అర్హత లేదని విమర్శించారు. "లక్షల కోట్ల అవినీతితో వచ్చిన అహంకారం కేటీఆర్‌ది. ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్టు చేసిన మిమ్మల్ని, దోపిడీ చేసిన మిమ్మల్ని అరెస్టు చేస్తే తప్పేంటి? దమ్ముంటే ముందు కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా. మీ ఫోన్ ట్యాపింగ్ బాగోతాలు లేకపోతే కాంగ్రెస్‌కు వంద సీట్లు వచ్చేవి" అని దయాకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. బీఆర్ఎస్ నేతలు చర్చకు రాకుండా పారిపోతున్నారని ఆరోపించారు. రైతు భరోసా కింద 9 రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు జమ చేశామని, సంక్షేమంపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. సభ నిర్వహణకు కేసీఆర్‌తో లేఖ రాయించాలని డిమాండ్ చేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
KTR
K Taraka Rama Rao
Addanki Dayakar
Revanth Reddy
Telangana Politics
BRS
Congress
Telangana Funds
Farmer Issues
Assembly Debates

More Telugu News