Pawan Kalyan: వ్యక్తిగత దూషణలు తగదు.. ప్రసన్నకుమార్‌రెడ్డిపై పవన్ ఆగ్రహం

Pawan Kalyan Angered by Prasanna Kumar Reddys Comments
  • కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలు
  • తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాఖ్య‌
  • వైసీపీ నేతలకు మహిళలను కించపరచడం అలవాటైపోయిందని విమ‌ర్శ‌
  • ఇలాంటి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ప‌వ‌న్‌ పిలుపు
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం దారుణమని, ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "మహిళలపై అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడటం వైసీపీ నేతలకు ఒక అలవాటుగా మారిపోయింది. ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి" అని ఆయన పేర్కొన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జ‌న‌సేనాని స్పష్టం చేశారు.

గతంలో శాసనసభలోనూ వైసీపీ నేతలు ఇలాగే ప్రవర్తించారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్పారని పవన్ గుర్తుచేశారు. మహిళలను కించపరిచే ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి రాజకీయాలను రాష్ట్రంలోని మహిళా సమాజం మరోసారి తిప్పికొడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Nallapureddy Prasanna Kumar Reddy
Vemireddy Prasanthi Reddy
Kovuru MLA
Nellore District
YSRCP
Janasena
Political Comments
Women's Respect
Andhra Pradesh Politics

More Telugu News