Odisha: రోడ్డు లేదు.. అంబులెన్స్ రాలేదు.. గర్భిణిని డోలీలో 10 కి.మీ. మోసుకెళ్లిన గ్రామస్థులు

 Pregnant Odisha Woman Carried 10 km On Shoulders Due To Bad Roads
  • ఒడిశాలో గర్భిణికి పురిటి కష్టాలు
  • అధ్వానపు రోడ్డు కారణంగా మధ్యలోనే నిలిచిన అంబులెన్స్
  • 10 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లిన గ్రామస్థులు
  • కుర్చీ, వెదురు బొంగులతో తాత్కాలిక డోలీ ఏర్పాటు
  • ఆసుపత్రికి చేర్చడంతో సుఖ ప్రసవం
  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
రహదారి సౌకర్యం లేకపోవడం ఓ నిండు గర్భిణి పాలిట శాపంగా మారింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాలేకపోవడంతో గ్రామస్థులే డోలీ కట్టి 10 కిలోమీటర్లు మోసుకెళ్లారు. మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచిన ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. భోజ్‌గూడ గ్రామానికి చెందిన సునాయి భోజ్ అనే గర్భిణికి ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఖైరాపుట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోసం అభ్యర్థించారు. అంబులెన్స్ బయలుదేరినప్పటికీ రహదారి అధ్వానంగా, బురదమయంగా ఉండటంతో భోజ్‌గూడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుసాయి పాడ గ్రామం వద్ద నిలిచిపోయింది.

దీంతో ఏమాత్రం ఆలస్యం చేయని భోజ్‌గూడ గ్రామస్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. వెదురు బొంగులు, ఓ గుడ్డ సహాయంతో కుర్చీని కట్టి తాత్కాలిక డోలీని సిద్ధం చేశారు. దానిపై సునాయిని కూర్చోబెట్టి, ఆ బురద రోడ్డులోనే నడుచుకుంటూ 10 కిలోమీటర్ల దూరంలోని తుసాయి పాడ గ్రామానికి మోసుకెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లోకి ఆమెను ఎక్కించి, ఖైరాపుట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సునాయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంబులెన్స్ డ్రైవర్ పేర్కొన్నారు.
Odisha
Sunai Bhoj
pregnant woman
ambulance
road access
Khairaput Community Health Center
villagers help
delivery
Tusai Pada village
Bhojguda

More Telugu News