దుబాయ్ గోల్డెన్ వీసా ఆఫర్ పై వెల్లువెత్తుతున్న మీమ్స్
- రూ.23 లక్షలు కడితే జీవితాంతం దుబాయ్‌లో ఉండొచ్చంటూ యూఏఈ ఆఫర్
- తొలి దశలోనే భారత్, బంగ్లాదేశ్ పౌరులకు ఈ సౌకర్యం
- ఈ వార్తపై సోషల్ మీడియాలో మీమ్స్‌తో నెటిజన్ల సందడి
"పంచాయత్" వెబ్ సిరీస్ మీమ్‌తో "మేం పేదవాళ్లం, అందుకే 23 లక్షలు పెట్టి దుబాయ్ వెళ్లలేం" అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో యూఏఈ గోల్డెన్ వీసా పొందాలంటే అక్కడి రియల్ ఎస్టేట్‌లో 2 మిలియన్ ఏఈడీ (దాదాపు రూ. 4.7 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను సడలించి శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు, యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు వంటి వివిధ రంగాల నిపుణులకు కూడా ఈ అవకాశాన్ని విస్తరించారు. ఈ కొత్త విధానం విదేశీ పౌరులు యూఏఈలో స్థిరపడటాన్ని మరింత సులభతరం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
యూఏఈ ఆఫర్ ఇదే..
"నామినేషన్ ఆధారిత వీసా పాలసీ" కింద యూఏఈ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. అర్హులైన భారతీయులు 1,00,000 ఏఈడీ (సుమారు రూ. 23.30 లక్షలు) రుసుము చెల్లించి జీవితకాల నివాస వీసాను పొందవచ్చు. కుటుంబ సభ్యులను కూడా దుబాయ్‌కు తీసుకెళ్లే సౌకర్యం ఉంది. తొలి దశలో ఈ అవకాశాన్ని భారత్, బంగ్లాదేశ్ పౌరులకు కల్పించింది.