Mahesh Babu: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో... మహేశ్ తండ్రిగా మాధవన్?

Mahesh Babu Rajamouli film Madhavan as father role
  • మహేష్-రాజమౌళి సినిమాలో చేరిన స్టార్ నటుడు మాధవన్
  • మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటించనున్నారని ప్రచారం
  • కెన్యాలోని అంబోసెలీ నేషనల్ పార్క్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభం
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన మహేశ్ బాబుకు తండ్రిగా కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ పాత్ర కోసం నానా పటేకర్, విక్రమ్ వంటి స్టార్ల పేర్లను పరిశీలించినట్లు సమాచారం.

ఒడిశా, హైదరాబాద్‌లలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్రబృందం, తాజాగా కెన్యాలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. అక్కడి అంబోసెలీ నేషనల్ పార్క్‌తో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో భారీ యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ ఘట్టాలతో ఈ షెడ్యూల్ సాగనుందని సమాచారం.

ఈ సినిమా కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఒక ప్రపంచ యాత్రగా ఉంటుందని, రామాయణంలోని 'సంజీవని' ఇతివృత్తం స్ఫూర్తితో కథను సిద్ధం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో మహేశ్ బాబును మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో చూపించనున్నారట. డైనోసార్ల వేట వంటి అంశాలు కూడా సినిమాలో ఉండబోతున్నాయని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి నటులు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారు. 
Mahesh Babu
Rajamouli movie
R Madhavan
SS Rajamouli
Telugu cinema
KL Narayana
Priyanka Chopra
Prithviraj Sukumaran
MM Keeravani
African forests

More Telugu News