Himachal Floods: హిమాచల్ వరదలు.. 67 మంది ప్రాణాలు కాపాడిన శునకం

Dog saves 67 lives in Himachal Pradesh floods
  • కొండచరియలు విరిగిపడటాన్ని ముందే పసిగట్టిన పెంపుడు కుక్క
  • కుక్క అరుపులతో నిద్రలేచి ఊరిని ఖాళీ చేయించిన యజమాని
  • కళ్ల ముందే నేలమట్టమైన పదుల సంఖ్యలో ఇళ్లు
  • మండి జిల్లా సియాతి గ్రామంలో జూన్ 30న ఈ ఘటన
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు సృష్టిస్తున్న విలయం మధ్య, ఓ మూగజీవి 67 మంది ప్రాణాలను కాపాడింది. పెంపుడు కుక్క అరవడంతో పెను ప్రమాదం నుంచి 20 కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి. కళ్ల ముందే తమ ఇళ్లు మట్టిలో కలిసిపోయినా, ప్రాణాలతో బయటపడ్డామని గ్రామస్థులు ఊరట చెందుతున్నారు. మండి జిల్లా ధర్మపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో జూన్ 30 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

భారీ వర్షం కురుస్తుండగా, నరేంద్ర అనే గ్రామస్థుడి ఇంట్లో నిద్రిస్తున్న కుక్క అర్ధరాత్రి సమయంలో గట్టిగా అరవడం, ఊళలు వేయడం ప్రారంభించింది. "దాని అరుపులకు నాకు మెలకువ వచ్చింది. వెళ్లి చూడగా ఇంటి గోడకు పెద్ద పగులు కనిపించి, నీరు లోపలికి రావడం మొదలైంది. వెంటనే కుక్కతో పాటు కిందకు పరిగెత్తి, నా కుటుంబ సభ్యులను, ఆ తర్వాత గ్రామస్తులందరినీ నిద్రలేపి సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాను" అని నరేంద్ర వివరించారు.

వారు గ్రామాన్ని వీడిన కొద్దిసేపటికే కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయింది. ప్రాణాలతో బయటపడిన వారంతా ప్రస్తుతం సమీపంలోని నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఘటనతో చాలామంది రక్తపోటు, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రభుత్వం వారికి రూ. 10,000 తక్షణ సాయం అందించింది.

జూన్ 20న రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష సంబంధిత ఘటనల వల్ల 50 మంది, రోడ్డు ప్రమాదాల్లో 28 మంది సహా మొత్తం 78 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 16 కొండచరియలు విరిగిపడటం, 19 మేఘ విస్ఫోటాలు, 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. అత్యధిక మరణాలు మండి జిల్లాలోనే నమోదయ్యాయి. మరోవైపు, భారత వాతావరణ శాఖ 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది.
Himachal Floods
Dog saves lives
Mandi district
Landslide
Flash floods
India Meteorological Department
Rainfall alert
Disaster Management

More Telugu News