Indigo Airlines: తేనెటీగల దెబ్బకు గంటకు పైగా నిలిచిపోయిన ఇండిగో విమానం

Indigo Flight Delayed by Bees at Surat Airport
  • సూరత్-జైపూర్ ఇండిగో విమానానికి వింత అనుభవం
  • లగేజీ డోర్‌పై తిష్ట వేసిన వేలాది తేనెటీగలు
  • పొగ పెట్టినా కదలకపోవడంతో ఫైర్ ఇంజిన్ పిలుపు
విమాన ప్రయాణాలు సాంకేతిక లోపాలు లేదా వాతావరణ సమస్యల వల్ల ఆలస్యం కావడం సర్వసాధారణం. కానీ, సూరత్‌లో ఓ విమానం తేనెటీగల కారణంగా గంటకు పైగా ఆలస్యం అయింది. ఈ విచిత్ర సంఘటన ప్రయాణికులను, సిబ్బందిని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే, సూరత్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E-784 టేకాఫ్‌కు సిద్ధమైంది. ప్రయాణికులందరూ విమానంలోకి ఎక్కగా, సిబ్బంది వారి లగేజీని లోడ్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో, ఎక్కడి నుంచి వచ్చిందో ఓ తేనెటీగల గుంపు నేరుగా వచ్చి విమానం లగేజీ డోర్‌పై వాలింది. వాటిని చూసి సిబ్బంది మొదట గందరగోళానికి గురయ్యారు.

వాటిని తరిమికొట్టేందుకు సిబ్బంది మొదట పొగ పెట్టారు. కానీ, ఆ తేనెటీగలు అక్కడి నుంచి ఇంచు కూడా కదలలేదు. దీంతో చేసేదేమీ లేక విమానాశ్రయ అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్, లగేజీ డోర్‌పై నీటిని బలంగా చల్లింది. ఆ నీటి ధాటికి తేనెటీగలు ఎగిరిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ అనూహ్య ఘటన వల్ల సాయంత్రం 4:20 గంటలకు బయల్దేరాల్సిన విమానం, గంటకు పైగా ఆలస్యంగా 5:26 గంటలకు టేకాఫ్ అయింది. ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ, "తేనెటీగల సమస్య వల్లే విమానం ఆలస్యమైంది. ఇది మా నియంత్రణలో లేని విషయం. అవసరమైన అన్ని ప్రామాణిక ప్రోటోకాల్స్ పాటించిన తర్వాతే విమానాన్ని నడిపాం" అని వివరించింది. 
Indigo Airlines
Surat Airport
Jaipur
Flight Delay
Bees Attack
6E-784
Aviation Safety
Honey Bees
Fire Department
Aircraft Incident

More Telugu News