Durga Malleswara Swamy: ఇంద్రకీలాద్రిలో వైభవంగా ఆరంభమైన శాకంబరీ ఉత్సవాలు ..

Durga Malleswara Swamy Shakambari Utsavalu Begins at Indrakilaadri
  • శాకంబరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న బెజవాడ కనకదుర్గమ్మ
  • తెలుగు రాష్ట్రాల నుంచి ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు 
  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆలయ ఈవో శీనునాయక్
బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూలవిరాట్ దుర్గమ్మను శాకంబరీదేవి రూపంలో పండ్లు, ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో విశేషంగా అలంకరించారు.

ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండలతో అందంగా తీర్చిదిద్దారు. దీంతో ఇంద్రకీలాద్రి హరిత వర్ణంలో శోభిల్లుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శాకంబరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. భారీ ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజల్లో ఆలయ ఈవో శీనునాయక్ పాల్గొన్నారు.

ఉత్సవాల్లో తొలి రోజైన ఈరోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలు వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుంచి ఆలయ సిబ్బంది కూరగాయలు సేకరించారు. ఆషాడ సారె సమర్పణ బృందాలు, శాకంబరీ దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.

శాకంబరి ఉత్సవాలు ఈ నెల 10వ తేదీతో ముగియనుండగా, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
Durga Malleswara Swamy
Indrakilaadri
Shakambari Utsavalu
Vijayawada
Kanaka Durga Temple
AP Temples
Telugu Festivals
Temple Events
Andhra Pradesh Tourism

More Telugu News