Brazil President: ప్రపంచానికి చక్రవర్తి అవసరంలేదు.. ట్రంప్ బెదిరింపులకు బ్రెజిల్ ప్రెసిడెంట్ కౌంటర్

Brazil President Luiz Inacio Lula da Silva Counters Trumps Threats
  • డాలర్‌కు ప్రత్యామ్నాయం తప్పదన్న బ్రెజిల్
  • అమెరికా బెదిరింపులను తిప్పికొట్టిన బ్రిక్స్ దేశాలు
  • మమ్మల్ని బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమన్న లూలా
బ్రిక్స్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తీవ్రంగా స్పందించారు. ప్రపంచానికి ఒక చక్రవర్తి అవసరం లేదని, పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన స్పష్టం చేశారు. రియో డి జెనీరోలో సోమవారం ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అనంతరం లూలా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొత్త పద్ధతిలో తీర్చిదిద్దేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని, అందుకే కొందరికి ఇది ఇబ్బందికరంగా మారిందని ఆయన అన్నారు.

అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు పూర్తిగా డాలర్‌పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని లూలా నొక్కిచెప్పారు. ఇది క్రమంగా జరగాల్సిన ప్రక్రియ అని, ఇందుకోసం సభ్య దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిసి పనిచేయాలని సూచించారు. డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే బ్రిక్స్ దేశాలపై 100% టారిఫ్‌లు తప్పవని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. తాజాగా ఆయన 14 దేశాలపై అధిక సుంకాలను విధించి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు.

అయితే, బ్రిక్స్ దేశాలపై వెంటనే సుంకాలు విధించే ఆలోచన లేదని, కానీ అమెరికా వ్యతిరేక చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని యూఎస్ వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు, ట్రంప్ హెచ్చరికలపై ఇతర బ్రిక్స్ దేశాలైన చైనా, రష్యా, దక్షిణాఫ్రికా ఆచితూచి స్పందించాయి. తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని, బలవంతపు చర్యల కోసం సుంకాలను ఆయుధంగా వాడొద్దని చైనా హితవు పలికింది. ఈ విషయంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Brazil President
Donald Trump
BRICS Summit
Trade Tariffs
US Tariffs
International Trade
Dollar Dominance
Global Economy
China

More Telugu News