Karnataka: కర్ణాటకలో అమానుషం.. తల్లికి దెయ్యం పట్టిందని కొడుకు పైశాచికత్వం

Karnataka Man Takes Possessed Mother To Exorcist She Is Beaten To Death
  • మూఢనమ్మకంతో దారుణ హత్య
  • దెయ్యం పట్టిందన్న అనుమానంతో తల్లిని కొట్టించిన కొడుకు
  • భూతవైద్యం పేరుతో మహిళపై గంటల తరబడి కర్రలతో దాడి
  • తీవ్ర గాయాలతో 55 ఏళ్ల గీతమ్మ మృతి
  • కొడుకు సంజయ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
మూఢనమ్మకం కన్నతల్లి ప్రాణాలను బలిగొంది. ఆమెకు దెయ్యం పట్టిందన్న అనుమానంతో కన్నకొడుకే కొందరితో కలిసి ఆమెను కర్రలతో కొట్టి చంపించిన అమానవీయ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే... గీతమ్మ (55) ప్రవర్తనలో మార్పులు రావడంతో ఆమెకు దెయ్యం పట్టిందని ఆమె కొడుకు సంజయ్ బలంగా నమ్మాడు. ఈ క్రమంలో భూతవైద్యం చేస్తానని చెప్పిన ఆశ అనే మహిళను, ఆమె భర్త సంతోశ్‌ను సంప్రదించాడు. సోమవారం రాత్రి గీతమ్మ ఇంటికి వచ్చిన ఆశ, సంతోశ్‌ దెయ్యం వదిలించే పూజలు మొదలుపెట్టారు.

ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియోలో అర్ధ స్పృహలో ఉన్న గీతమ్మ తలపై నిమ్మకాయతో కొట్టడం, జుట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టడం వంటి దృశ్యాలు ఉన్నాయి. రాత్రి 9:30 గంటలకు మొదలైన ఈ దాడి తెల్లవారుజామున 1:00 గంట వరకు కొనసాగింది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో గీతమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, గీతమ్మ కొడుకు సంజయ్‌తో పాటు భూతవైద్యం పేరుతో దాడికి పాల్పడిన ఆశ, ఆమె భర్త సంతోశ్‌ను అరెస్ట్ చేశారు. ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Karnataka
Sanjay
Karnataka crime
superstition murder
Shivamogga district
witchcraft killing
Geetamma
black magic
Asha and Santosh
crime news
India news

More Telugu News