Wiaan Mulder: బ్రియన్ లారా ఒక లెజెండ్.. ఆయన రికార్డు ఆయనకే: వియాన్ ముల్డర్

Wiaan Mulder Praises Brian Lara Record Stays With Him
  • టెస్టుల్లో 400 పరుగుల మైలురాయికి చేరువలో ఇన్నింగ్స్ డిక్లేర్
  • దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ అరుదైన క్రీడాస్ఫూర్తి
  • లెజెండ్ బ్రియన్ లారా రికార్డు ఆయనకే దక్కాలని వెల్లడి
  • 367 పరుగులతో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ స్కోరు నమోదు
టెస్ట్ క్రికెట్‌లో 400 పరుగుల అరుదైన మైలురాయిని అందుకునే సువర్ణావకాశం ముంగిట నిలిచినా, ఓ కెప్టెన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా రికార్డుకు గౌరవమిస్తూ, చారిత్రక ఘనతను స్వయంగా వదులుకుని క్రీడాస్ఫూర్తిని చాటాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ ఈ అరుదైన నిర్ణయంతో క్రీడాభిమానుల మనసులు గెలుచుకున్నాడు.

సోమవారం రెండో రోజు ఆటలో భాగంగా ముల్డర్ 367 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అజేయంగా నిలిచాడు. లారా నెలకొల్పిన 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టేందుకు అతనికి కేవలం 33 పరుగులు అవసరం. అయితే, లంచ్ విరామానికి జట్టు స్కోరు 626/5 వద్ద ఉండగా, ముల్డర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఈ నిర్ణయంపై ముల్డర్ మాట్లాడుతూ... "బ్రియన్ లారా ఒక లెజెండ్. ఆయన స్థాయికి ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉండటమే సబబు. జట్టుకు సరిపడా పరుగులు కూడా వచ్చాయి. అందుకే బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మళ్లీ అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను" అని స్పష్టం చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌తో ముల్డర్ పలు రికార్డులు సృష్టించాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (గతంలో హషీమ్ ఆమ్లా 311) సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా, కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్‌గా నిలిచాడు.
Wiaan Mulder
Brian Lara
South Africa
Zimbabwe
Test Cricket
Cricket Record
Hashim Amla
Sportsmanship
Cricket
Captain

More Telugu News