Gold prices: తగ్గిన బంగారం ధరలు... అదే దారిలో వెండి

Gold Silver Prices Fall Amid Trade Uncertainty
  • సోమవారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
  • తులం బంగారంపై రూ.425 మేర పడిపోయిన రేటు
  • కిలో వెండి ధర రూ.1000కి పైగా పతనం
  • అమెరికా వాణిజ్య సుంకాలపై అనిశ్చితితోనే ధరల తగ్గుదల
బంగారం ప్రియులకు, పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే వార్త ఇది. సోమవారం నాడు బంగారం, వెండి ధరలు తగ్గాయి. అమెరికా వాణిజ్య సుంకాలను గురించి నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాలు వెలువడటంతో దేశీయ మార్కెట్‌లో కూడా పసిడి, వెండి ధరలు దిగి వచ్చాయి.

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.425 తగ్గి రూ.96,596 వద్ద స్థిరపడింది. అంతకు ముందు రోజు దీని ధర రూ.97,021గా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర ఏకంగా రూ.1,049 పతనమై రూ.1,06,531కి చేరింది. ఆదివారం దీని ధర రూ.107,580గా నమోదైంది.

అమెరికా వాణిజ్య సుంకాల గడువు ముగుస్తుండటంతో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది. ఈ కారణంగానే మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఇది బంగారం ధరలపై ఒత్తిడి పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతిన్ త్రివేది ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్టు కాంట్రాక్టు సైతం రూ.487 నష్టపోయి రూ.96,503 వద్ద ముగిసింది.
Gold prices
Gold rate today
Silver prices
Silver rate today
India Bullion and Jewellers Association

More Telugu News