Asaduddin Owaisi: భారత్ లో మైనారిటీలు బందీలుగా బతుకుతున్నారు: రిజిజు వ్యాఖ్యలపై ఒవైసీ ఫైర్

Asaduddin Owaisi Fires Back at Rijiju Over Minority Remarks
  • మైనార్టీలకు అధిక ప్రయోజనాలంటూ కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్యలు
  • మేం బందీలుగా బతుకుతున్నామంటూ తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్
  • మూకదాడులు, బుల్డోజర్ల కూల్చివేతలపై ఘాటు ప్రశ్నలు
  • ముస్లిం విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల రద్దును ప్రస్తావించిన ఒవైసీ
  • రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని మంత్రికి గుర్తుచేసిన ఎంపీ
  • వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు
దేశంలో మైనార్టీలు పౌరులుగా కాకుండా బందీలుగా బతుకుతున్నారంటూ ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశంలో మెజారిటీ వర్గాల కంటే మైనార్టీలకే ఎక్కువ ప్రయోజనాలు, రక్షణ లభిస్తోందంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం ఘాటుగా స్పందించారు. రిజిజు వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని, ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్షను ఆయన విస్మరించారని మండిపడ్డారు.

ఎక్స్ వేదికగా అసదుద్దీన్ ఒవైసీ సుదీర్ఘ పోస్టులో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "భారతదేశంలో మైనార్టీలు రెండో తరగతి పౌరులుగా కూడా లేరు. మేమిప్పుడు బందీలం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చెబుతున్న ప్రయోజనాలు ఏమిటో చెప్పాలని ఒవైసీ నిలదీశారు. "ప్రతిరోజూ పాకిస్థానీ, బంగ్లాదేశీ, జిహాదీ అంటూ పిలిపించుకోవడం ప్రయోజనమా? మూకదాడుల్లో ప్రాణాలు కోల్పోవడమే రక్షణా? మా ఇళ్లు, మసీదులను చట్టవిరుద్ధంగా కూల్చివేయడాన్ని చూస్తూ ఉండటం ప్రత్యేక హక్కా? సాక్షాత్తు ప్రధానమంత్రి నుంచి విద్వేష ప్రసంగాలను ఎదుర్కోవడం గౌరవమా?" అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

రిజిజు ఒక చక్రవర్తిలా కాకుండా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిలా మాట్లాడాలని ఒవైసీ హితవు పలికారు. "మైనార్టీల హక్కులు ప్రాథమిక హక్కులే కానీ, ఎవరూ ఇస్తున్న భిక్ష కాదు" అని ఆయన స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రస్తావిస్తూ, హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు సభ్యులుగా ఉండలేరని, కానీ వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులు సభ్యులుగా చేరి మెజారిటీ సాధించేలా చట్టం చేశారని విమర్శించారు.

ప్రభుత్వ విధానాల వల్ల ముస్లిం విద్యార్థులు నష్టపోతున్నారని ఒవైసీ ఆరోపించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను రద్దు చేయడాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఉన్నత విద్యలో ముస్లింల సంఖ్య గణనీయంగా పడిపోయిందని తెలిపారు. భారతీయ ముస్లింల పిల్లలు వారి తల్లిదండ్రుల కంటే అధ్వాన్న స్థితిలో ఉన్నారని, తరతరాల అభివృద్ధి తిరోగమనంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మెజారిటీ వర్గాల కన్నా ఎక్కువ ఏమీ కోరడం లేదని, రాజ్యాంగం హామీ ఇచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని ఒవైసీ స్పష్టం చేశారు.
Asaduddin Owaisi
Kiren Rijiju
Minorities in India
AIMIM
Muslim Rights
Indian Politics
Minority Welfare
Maulana Azad National Fellowship
Pre-Matric Scholarship
Muslim Education

More Telugu News