Vakiti Srihari: గొర్రెలు, బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలి?: కేటాయించిన శాఖలపై మంత్రి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Vakiti Srihari Disappointed with Assigned Portfolios
  • గత పదేళ్లలో నాశనమైన శాఖలను తనకిచ్చారని ఆవేదన
  • గొర్రెలు, బర్రెలతో తానేం చేయాలని సూటి ప్రశ్న
  • ఇది తన అదృష్టమో, దురదృష్టమో అర్థం కావడం లేదన్న శ్రీహరి
  • అంతకుముందు కరీంనగర్‌లో క్రీడా పాఠశాలలపై కీలక ప్రకటనలు
  • రాష్ట్రంలో కొత్తగా మూడు క్రీడా పాఠశాలల ఏర్పాటుకు హామీ
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత పదేళ్లలో పూర్తిగా దెబ్బతిన్న శాఖలను తనకు అప్పగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కేటాయించిన ఐదు శాఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని చూస్తుంటే ఇది తన అదృష్టమో లేక దురదృష్టమో అర్థం కావడం లేదని అన్నారు.

"పశుసంవర్థక శాఖ మొత్తం గందరగోళంగా ఉంది. యువజన సర్వీసులు ఇచ్చి నన్నేం చేసుకోమంటారు? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?" అని మంత్రి శ్రీహరి నిరాశ వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అంతకుముందు కరీంనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, క్రీడల అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్‌తో పాటు, కబడ్డీ, హ్యాండ్‌బాల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో కొత్త క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
Vakiti Srihari
Telangana Minister
Animal Husbandry
Youth Services
Sports Development

More Telugu News