Nara Lokesh: మీ తండ్రి హయాంలోనే భయపడలేదు.. మీ రప్పా రప్పాకు భయపడతామా?: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Slams Jagan Over Political Violence
  • ప్రతిపక్షంలో ఉన్నా జగన్ వైఖరి మారలేదన్న మంత్రి లోకేశ్
  • అధికారం పోయినా ఇంకా హెలికాఫ్టర్‌లోనే తిరుగుతున్నారని విమర్శ
  • పల్నాడు పర్యటనలో కార్యకర్త మృతిపై జగన్‌ తీరును తప్పుబట్టిన లోకేష్
  • కారు కిందపడ్డ కార్యకర్తను కనీసం చూడలేదని తీవ్ర ఆరోపణ
  • బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లను వైసీపీ ప్రోత్సహించిందని వ్యాఖ్య
  • నెల్లూరులో టీడీపీ నేతలతో మంత్రి సమన్వయ సమావేశం
"మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పార్టీకి చెందిన 164 మంది కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. ఆనాడే మేము భయపడలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన మీ బెదిరింపులకు భయపడతామా?" అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంలోకి వచ్చినా జగన్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, ఆయన పర్యటనలంటేనే ప్రజల ప్రాణాలు తీయడమని ఘాటుగా విమర్శించారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్‌లో టీడీపీ పట్టణ నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా మనుషుల్ని చంపుకుంటూ వెళుతున్నారు, పల్నాడు జిల్లా పర్యటనలో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి ముగ్గురిని చంపారు. ఒకరిని కారు కింద పడేసి చంపారు. రెండో వ్యక్తి ఊపిరాడక చనిపోయారు. మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరుక్కుపోయారు. జనసమీకరణ మనం చేయలేక కాదు.. మనవల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. కార్యకర్త కారు కిందపడితే కనీసం దిగి చూడలేదు. కార్యకర్తను రోడ్డున పక్కన పడేసి వెళ్లిపోయారు. దిగి చూసి ఆసుపత్రికి పంపించి ఉంటే బతికేవాడు. బాధిత కుటుంబం తల్లిని తీసుకువచ్చి కనీసం కూర్చోపెట్టలేదు. గ్లాస్ మంచినీరు అయినా ఇచ్చారా? సొంత కార్యకర్త చనిపోతే నిల్చొని రెండు భుజాలు తట్టి వెళ్లిపోయారు.

వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బ్లేడ్ బ్యాచ్ ను, గంజాయి బ్యాచ్ ను ప్రోత్సహిస్తున్నారు. మీ తండ్రి హయాంలోనే 164 మంది కార్యకర్తలను చంపారు. అప్పుడే భయపడలేదు, మీ రప్పా, రప్పాకు భయపడతామా? ప్రతిపక్షంలో ఉండగా బాబు గారి ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. వీరు మాట్లాడతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉంది. తిరగమంటే మనుషులను చంపుతున్నారు. నిబంధనలు పాటించమంటే ఎదురుదాడి చేస్తున్నారు. చిన్నసందులో వెళ్తా, మరో ముగ్గురుని చంపుతా అంటున్నారు.

టీడీపీ కార్యకర్తలు అలక మానుకోవాలి

"మనకు ఉన్న పెద్ద జబ్బు అలగడం. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా. కొన్ని నిర్ణయాలు తప్పు కావచ్చు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నా. ఒక్కసారి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తలవంచి పనిచేస్తా. పార్టీ ఫస్ట్, కార్యకర్తలు పస్ట్. కార్యకర్తలు అలక మానుకోవాలి. మన సమస్యలు కలిసికట్టుగా కూర్చొని మనమే పరిష్కరించుకోవాలి..." అని లోకేశ్ హితవు పలికారు.

1500 మందిని కలిసిన లోకేశ్

సమన్వయ సమావేశం అనంతరం దాదాపు 1500 మందిని మంత్రి నారా లోకేష్ కలిశారు. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కరించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతిఒక్కరితో కలిసి ఫోటోలు దిగారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేపీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
YS Jaganmohan Reddy
TDP
Andhra Pradesh Politics
Nellore
YS Rajasekhara Reddy
TDP Activists
Political Criticism
Andhra Pradesh Government
Minister Nara Lokesh

More Telugu News