Dalai Lama: దలైలామాకు మోదీ శుభాకాంక్షలు.. భారత్‌కు చైనా తీవ్ర నిరసన

Dalai Lama Birthday Modi Wishes Draw China Protest
  • దలైలామా 90వ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
  • మోదీ శుభాకాంక్షలు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా
  • ఈ విషయంలో భారత్‌కు అధికారికంగా నిరసన తెలిపిన డ్రాగన్
  • దలైలామా వేర్పాటువాది.. ఆయన విషయంలో జోక్యం వద్దని హెచ్చరిక
  • టిబెట్ సున్నితమైన అంశమని.. భారత్ దీన్ని గుర్తించాలని చైనా స్పష్టీకరణ
టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలపడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం నాడు భారత్‌కు తమ నిరసనను అధికారికంగా తెలియజేసినట్లు ప్రకటించింది. టిబెట్‌కు సంబంధించిన అంశాల సున్నితత్వాన్ని భారత్ పూర్తిగా అర్థం చేసుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ హెచ్చరించారు.

బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ "14వ దలైలామా మతం ముసుగులో చాలా కాలంగా చైనా నుంచి టిబెట్‌ను వేరుచేయాలని చూస్తున్న రాజకీయ ప్రవాసి, వేర్పాటువాది. ఆయన వేర్పాటువాద స్వభావాన్ని భారత్ గుర్తించాలి" అని ఆరోపించారు.

ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు చెప్పడం, భారత ప్రభుత్వ అధికారులు దలైలామా పుట్టినరోజు వేడుకలకు హాజరుకావడంపై చైనా నిరసన తెలిపినట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఉపయోగించి తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని భారత్‌కు సూచించారు.

ఆదివారం దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దలైలామా ప్రేమ, కరుణ, సహనానికి ప్రతీక అని కొనియాడారు. ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ధర్మశాలలో జరిగిన వేడుకలకు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

ఇటీవల దలైలామా పునరావతారంపై కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యల పైనా చైనా అభ్యంతరం తెలిపింది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం తమ ప్రభుత్వానిదేనని చైనా వాదిస్తుండగా, అది బౌద్ధ సంప్రదాయాల ప్రకారం జరుగుతుందని భారత్, దలైలామా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Dalai Lama
Narendra Modi
China
India
Tibet
Tibetan Buddhism
Birthday wishes
Mao Ning

More Telugu News