Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ 'టారిఫ్' హెచ్చరిక.. స్పందించిన చైనా

Donald Trump Warns BRICS Nations on Tariffs China Responds
  • బ్రిక్స్ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక
  • అమెరికాకు వ్యతిరేకంగా వెళ్తే 10 శాతం అదనపు సుంకాలు
  • ట్రంప్ ప్రకటనపై వెంటనే స్పందించిన చైనా
  • సుంకాల పోరులో విజేతలు ఉండరన్న డ్రాగన్
బ్రిక్స్ కూటమిలోని దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరించే ఏ దేశంపైనైనా సరే 10 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తామని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సదస్సులో భారత ప్రధానమంత్రితో పాటు ఇతర సభ్య దేశాల నేతలు అమెరికా సుంకాల విధానాన్ని పరోక్షంగా ప్రస్తావించిన నేపథ్యంలో ట్రంప్ స్పందన వచ్చింది.

ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలపై చైనా స్పందించింది. సుంకాల యుద్ధంలో ఎవరూ విజేతలుగా నిలవరని, తాము ఘర్షణను కోరుకోవడం లేదని పునరుద్ఘాటించింది. రక్షణాత్మక వాణిజ్య వైఖరి సరైంది కాదని చైనా పేర్కొంది. గతంలో అమెరికా-చైనాల మధ్య తీవ్రమైన వాణిజ్య యుద్ధం నడిచినప్పటికీ, ఆ తర్వాత కుదిరిన ఒప్పందంతో అది తాత్కాలికంగా సద్దుమణిగింది.

కాగా, బ్రిక్స్ కూటమిపై ట్రంప్ ఇటీవల కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్‌తో ఆడుకోవాలని చూస్తే, వాణిజ్యపరంగా వారిని దెబ్బతీస్తానని బెదిరించారు. "నా హెచ్చరికలతోనే బ్రిక్స్ ప్రతిపాదన బలహీనపడింది. ఒకవేళ వారు మాకు వ్యతిరేకంగా ముందుకెళితే 100 శాతం సుంకాలు వేస్తాను. అప్పుడు నా దగ్గరకే వచ్చి వేడుకుంటారు" అని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో ప్రారంభమైన బ్రిక్స్ కూటమిలో ఇటీవల ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.
Donald Trump
BRICS
China
Tariffs
Trade war
US Tariffs
Brazil
Trade policy
International trade
Global economy

More Telugu News