Heart Health: మీ గుండె భద్రంగా ఉండాలంటే... రాత్రిపూట ఆ పని అస్సలు చేయొద్దు!

Brighter night time light exposure may not be good for your heart
  • రాత్రిపూట లైట్లు వేసుకుని నిద్రపోతే గుండె జబ్బుల ముప్పు
  • ఐదు ప్రధాన హృద్రోగాల ప్రమాదాన్ని పెంచుతున్న రాత్రి వెలుతురు
  • 88,905 మందిపై అంతర్జాతీయ పరిశోధకుల అధ్యయనం
  • మహిళలు, యువతలో ఈ ప్రమాదం మరింత అధికమని వెల్లడి
  • శరీర జీవ గడియారం దెబ్బతినడమే ప్రధాన కారణమని గుర్తింపు
రాత్రిపూట లైట్ల వెలుతురులో నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే, ఈ అలవాటు గుండె ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తుందని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. రాత్రి సమయంలో అధిక కాంతికి గురవడం వల్ల ఐదు రకాల ప్రధానమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది.

ఫ్లిండర్స్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, యూకే, యూఎస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 88,905 మంది వ్యక్తుల నిద్ర విధానాలను పరిశీలించారు. వారి మణికట్టుకు ప్రత్యేక సెన్సార్లను అమర్చి, వారం రోజుల పాటు వారు ఎంత కాంతిలో నిద్రపోతున్నారనే సమాచారాన్ని సేకరించారు.

పూర్తి చీకటిలో నిద్రించే వారితో పోలిస్తే, రాత్రిపూట ఎక్కువ వెలుతురులో నిద్రించే వారికి కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు, హార్ట్ ఫెయిల్యూర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (గుండె అసాధారణంగా కొట్టుకోవడం), స్ట్రోక్ (పక్షవాతం) వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. ముఖ్యంగా మహిళలు, యువతలో ఈ ముప్పు మరింత అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఎందుకీ ప్రమాదం?
రాత్రిపూట కృత్రిమ కాంతి మన శరీరంలోని సహజ జీవ గడియారాన్ని (బయోలాజికల్ క్లాక్) దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది జీవక్రియలు, రక్తనాళాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి, చివరికి గుండె జబ్బులకు దారితీస్తుందని తెలిపారు. ధూమపానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి ఇతర ప్రమాద కారకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా రాత్రి వెలుతురు ప్రభావం స్పష్టంగా కనిపించిందని వారు పేర్కొన్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికే ఉన్న నివారణ చర్యలతో పాటు రాత్రిపూట లైట్లు ఆపి చీకటిలో నిద్రపోవడం ఒక ఉత్తమమైన మార్గమని ఈ అధ్యయనం సూచిస్తోంది.
Heart Health
Night Light
Sleep
Coronary Artery Disease
Heart Attack
Heart Failure
Atrial Fibrillation
Stroke

More Telugu News