Rashmika Mandanna: ఏడాదిన్నరగా ఇంటి మొహం చూడలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

Rashmika Mandanna Misses Family After a Year and Half
  • వృత్తి జీవితం వల్ల కుటుంబాన్ని మిస్ అవుతున్నానన్న రష్మిక
  • వారాంతపు సెలవుల కోసం ఏడుపు వస్తుందని భావోద్వేగం
  • తన చెల్లిని సరిగా చూసుకోలేకపోతున్నానని ఆవేదన
  • స్నేహితులు కూడా ట్రిప్స్‌కు పిలవడం మానేశారని వ్యాఖ్య
  • ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసేందుకు కష్టపడుతున్నానన్న నటి
పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి రష్మిక మందన్న, తన వృత్తి జీవితం కారణంగా వ్యక్తిగత జీవితానికి దూరమవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్‌లో అగ్రస్థాయికి చేరుకున్నప్పటికీ కుటుంబాన్ని, ముఖ్యంగా తన చెల్లిని మిస్ అవుతున్నానని, ఒక్కోసారి వారాంతపు సెలవు కోసం ఏడుపు వస్తుందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై రష్మిక స్పందించారు. "నేను ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్లలేదు. నాకు ఒక చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. నేను కెరీర్ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఈ సమయంలో నేను తనని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఈ విషయం నన్ను ఎంతో బాధిస్తోంది" అని చెప్పుకొచ్చారు. బిజీ షెడ్యూల్స్ వల్ల స్నేహితులకు కూడా దూరమయ్యానని, ఒకప్పుడు విహారయాత్రలకు పిలిచే స్నేహితులు కూడా ఇప్పుడు తనకు సమయం ఉండదని భావించి పిలవడం మానేశారని వాపోయారు.

ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన మాటలను రష్మిక గుర్తుచేసుకున్నారు. "కెరీర్‌లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని, అదే వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే కెరీర్‌లో కొన్నింటిని వదులుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కానీ నేను మాత్రం ఈ రెండింటినీ సమన్వయం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను" అని తెలిపారు.

ప్రస్తుతం రష్మిక ఆయుష్మాన్ ఖురానాతో ‘థామా’తో పాటు ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘మైసా’ వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
Rashmika Mandanna
Rashmika
Actress
Pan India Star
Family
Sister
Career
Thamaa
The Girlfriend
Maisa

More Telugu News