UAE Golden Visa: కొత్త రకం 'గోల్డెన్ వీసా' ప్రకటించిన యూఏఈ

UAE Announces New Golden Visa Nomination System
  • నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాల జారీకి యూఏఈ సన్నాహాలు
  • ఈ కొత్త రకం గోల్డెన్ వీసాలు జారీ తొలుత భారత్, బంగ్లాదేశ్ వాసులకు 
  • భారత్‌లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేసిన యూఏఈ
యూఏఈ సరికొత్త గోల్డెన్ వీసాలను ప్రకటించింది. ఇప్పటికే యూఏఈ అందిస్తున్న గోల్డెన్ వీసాలకు విశేష ఆదరణ లభిస్తుండగా, తాజాగా మరిన్ని రకాల గోల్డెన్ వీసాలను అందుబాటులోకి తెచ్చేందుకు యూఏఈ సిద్ధమైంది. ఇప్పటివరకు స్థిరాస్తుల కొనుగోలు, వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేవారికి గోల్డెన్ వీసాలను జారీ చేస్తుండగా, ప్రస్తుతం నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

తొలుత ఈ కొత్త రకం గోల్డెన్ వీసాల జారీని భారత్, బంగ్లాదేశ్ దేశాల పౌరులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం భారత్‌లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. ఇప్పటివరకు భారత్ నుంచి దుబాయ్ గోల్డెన్ వీసా పొందేవారు స్థిరాస్తిలో కనీసం 20 లక్షల ఏఈడీ (సుమారు రూ.4.66 కోట్లు) పెట్టుబడి పెట్టేవారు లేదా వ్యాపారంలో భారీగా నిధులు ఇన్వెస్ట్ చేసేవారు.

అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత వీసా విధానంలో లక్ష ఏఈడీలు (దాదాపు రూ.23.30 లక్షలు) ఫీజు చెల్లించడం ద్వారా జీవితకాలం చెల్లుబాటు అయ్యే వీసాను పొందవచ్చని సంబంధిత వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి. ఈ విధానం ద్వారా మూడు నెలల్లో 5 వేల మందికి పైగా భారతీయులు దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా కన్సల్టెన్సీ రయాద్ గ్రూప్ ఎండీ రయాద్ కమల్ అయూబ్ మాట్లాడుతూ, భారతీయులు యూఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు ఇదొక సువర్ణావకాశంగా అభివర్ణించారు. ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా యాంటీ మనీలాండరింగ్, క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తామని చెప్పారు.

అంతేకాకుండా, ఆర్థికం, వాణిజ్యం, సైన్స్, స్టార్టప్, ఉద్యోగ సేవలు వంటి రంగాల్లో యూఏఈ మార్కెట్‌కు వారు ఏ విధంగా ఉపయోగపడతారో కూడా పరిశీలిస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం కోసం దరఖాస్తును ప్రభుత్వానికి పంపుతామని ఆయన వెల్లడించారు.

దరఖాస్తుదారులు దుబాయ్ సందర్శించాల్సిన అవసరం లేకుండానే వారి స్వదేశం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఆన్‌లైన్ పోర్టల్, వన్ వాస్కో కేంద్రాలు (వీసా సేవల కంపెనీ), ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు.

ఈ రకం గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను దుబాయ్‌కు తీసుకురావడంతో పాటు సహాయకులను, డ్రైవర్లను నియమించుకోవచ్చని, స్థానికంగా ఏదైనా వ్యాపారం లేదా ఉద్యోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నామినేషన్ ఆధారిత వీసా జీవితాంతం చెల్లుబాటు అవుతుందని ఆయన వివరించారు. ఈ పైలట్ ప్రాజెక్టును త్వరలో చైనా, ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
UAE Golden Visa
UAE
Golden Visa
Nomination based visa
Riyadh Group
Dubai
Investment Visa
Immigration
Work permit
Residency

More Telugu News