Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్ లో 'క్లౌడ్ బరస్ట్'... 69కి పెరిగిన మృతుల సంఖ్య

Himachal Pradesh Floods Death Toll Rises to 69 After Cloudburst
  • హిమాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తిన కుండపోత వర్షాలు
  • జూన్ 20 నుంచి ఇప్పటివరకు 69 మంది మృతి
  • మండీ జిల్లాలో అత్యధికంగా నష్టం, కూలిన ఇళ్లు
దేవభూమిగా పేరొందిన హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా జూన్ 20 నుంచి జూలై 3 మధ్యకాలంలో సుమారు 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

వరదల తీవ్రతకు మండీ జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడ ఆకస్మిక వరదలకు అనేక ఇళ్లు పేకమేడల్లా కూలిపోగా, వందలాది వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. "క్లౌడ్‌ బరస్ట్ (కుండపోత) తర్వాత సర్వం కోల్పోయాం" అని ఓ స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్మీ, స్థానిక పోలీసులు, విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా మాట్లాడుతూ, "ప్రస్తుతం మా ప్రధాన దృష్టి సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపైనే ఉంది. నష్టం అంచనాకు మరింత సమయం పడుతుంది" అని తెలిపారు. మండీ జిల్లాలో కూలిపోయిన మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు సీనియర్ ఇంజనీర్లు, అధికారులను పంపినట్లు ఆయన వివరించారు.

ఈ విపత్తుల వెనుక వాతావరణ మార్పుల ప్రభావం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. "గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల పర్యవసానమే ఈ ఘటనలు. దీని ప్రభావం హిమాచల్‌పైనా పడింది" అని రాణా అన్నారు.
Himachal Pradesh Floods
Himachal Pradesh
Cloudburst
Heavy Rains
Landslides
Disaster Management
Mandi District
Global Warming
Climate Change
IMD

More Telugu News