Rishabh Chauhan: కారులో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లున్నా 60 సెకన్లలోనే చోరీ.. షాకింగ్ వీడియో!

Delhi Car Theft Owner Shares Shocking CCTV Footage
  • ఢిల్లీలో హైటెక్ దొంగలు.. సెక్యూరిటీ సిస్టమ్ హ్యాక్ చేసి కారు ఎత్తుకెళ్లారు!
  • సీసీటీవీ ఫుటేజీని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో యజమాని ఆవేదన
  • వీడియో వైరల్ కావడంతో స్పందించిన కార్ల కంపెనీ
ఢిల్లీలో జరిగిన ఓ హైటెక్ చోరీ ఇప్పుడు వాహన యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అత్యాధునిక భద్రతా ఫీచర్లతో తయారుచేసిన ఓ కారును దొంగలు జస్ట్ 60 సెకన్లలోనే ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కారు యజమాని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ, కార్ల భద్రతా వ్యవస్థపై తీవ్ర చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో నివసించే రిషభ్ చౌహాన్ తన కారును ఇంటిముందు పార్క్ చేయగా దొంగలు అపహరించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. మొదట ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి, పార్క్ చేసి ఉన్న రిషభ్ కారు అద్దం పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అదే కారు మళ్లీ వచ్చి ఆగింది. ఈసారి మాస్క్ ధరించిన మరో వ్యక్తి కారులోంచి దిగి, కారు సెక్యూరిటీ సిస్టమ్‌ను హ్యాక్ చేసి, క్షణాల్లో స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఆరు నెలల క్రితమే కొనుగోలు చేసిన తన కారు నిమిషంలోపే చోరీకి గురవడంపై చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై రిషభ్ చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, "ఓ కంపెనీ కార్ల సెక్యూరిటీ సిస్టమ్ ఎంత బలహీనంగా ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. దానిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఆ కంపెనీ కారు కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండండి" అని హెచ్చరించారు. ఢిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రత ఎలా ఉంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ను సదరు కార్ల కంపెనీకి ట్యాగ్ చేయగా, కంపెనీ స్పందించింది. "విషయాన్ని పరిశీలిస్తున్నాం. మీకు సహాయం చేయడానికి మీ కాంటాక్ట్ వివరాలు పంపండి" అని రిప్లై ఇచ్చింది. ఈ వీడియోకు ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చౌహాన్ తెలిపారు.
Rishabh Chauhan
car theft
Delhi
Safdarjung Enclave
car security
vehicle theft
CCTV footage
car hacking
auto theft
security system

More Telugu News