Neelam Azad: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో ఇద్దరు నిందితులకు బెయిల్

Neelam Azad Mahesh Kumawat Granted Bail in Parliament Security Breach Case
  • 2023 డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన 
  • నీలమ్ ఆజాద్, మహేశ్ కుమావత్‌లకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
  • ఢిల్లీ విడిచి వెళ్లరాదని, మీడియాతో మాట్లాడకూడదని షరతు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన ఇద్దరు నిందితులు నీలమ్ ఆజాద్, మహేశ్ కుమావత్‌లకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

నిందితులిద్దరూ రూ. 50,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, దానికి తోడు ఇద్దరి చొప్పున హామీ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ సమయంలో నిందితులు కఠినమైన షరతులను పాటించాల్సి ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ కేసుకు సంబంధించి మీడియాకు గానీ, సోషల్ మీడియాలో గానీ ఎలాంటి ఇంటర్వ్యూలు లేదా ప్రకటనలు చేయరాదని ఆదేశించింది. అలాగే, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఢిల్లీ విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో దర్యాప్తు సంస్థ ముందు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది.

2023 డిసెంబర్ 13న పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటన జరిగిన విషయం తెలిసిందే. సాగర్ శర్మ, మనోరంజన్ డి అనే ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి, కలర్ స్మోక్ క్యాన్‌లతో కలకలం సృష్టించారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల నీలమ్ ఆజాద్, అమోల్ షిండే నిరసన తెలుపుతూ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, కుట్ర వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాతో పాటు సహ నిందితుడు మహేశ్ కుమావత్‌ను కూడా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న నీలమ్ ఆజాద్, మహేశ్ కుమావత్‌లకు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది. 
Neelam Azad
Parliament security breach
Delhi High Court
Mahesh Kumawat
bail granted
security lapse case
Indian Parliament attack
Sagar Sharma
Manoranjan D
Lalit Jha

More Telugu News