స్వల్పంగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు: జూన్‌లో రూ.1.85 లక్షల కోట్లు
- గత రెండు నెలలతో పోలిస్తే తగ్గిన వసూళ్లు
- గతేడాదితో పోలిస్తే 6.2 శాతం వృద్ధి నమోదు
- విజయవంతంగా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న జీఎస్టీ విధానం
- గత ఐదేళ్లలో రెట్టింపైన పన్ను వసూళ్లు
గత సంవత్సరంతో పోలిస్తే వసూళ్లలో వృద్ధి కనబడనప్పటికీ, అంతకుముందు నెలలతో పోలిస్తే ఈ మొత్తం తక్కువగా ఉంది. గతేడాది జూన్‌తో పోల్చి చూస్తే ప్రస్తుత వసూళ్లు 6.2 శాతం అధికమని కేంద్రం పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లు, మే నెలలో రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆ గణాంకాలతో పోలిస్తే జూన్‌లో వసూళ్లు కొంత మేర తగ్గాయి.
మరోవైపు, దేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చి జులై 1 నాటికి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.11.37 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్టీ వసూళ్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.20.08 లక్షల కోట్లకు పెరిగాయని వివరించింది.