Princess Kako: ఎకానమీ క్లాస్‌లో జపాన్ యువరాణి... నిరాడంబరతకు ప్రశంసలు, ఫొటో లీక్‌పై వివాదం!

Japan Princess Kakos Economy Flight Photo Creates Buzz
  • బ్రెజిల్ పర్యటనలో జపాన్ యువరాణి కాకో
  • విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం
  • కిటికీ పక్కన నిద్రిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్
  • యువరాణి నిరాడంబరతపై నెటిజన్ల నుంచి ప్రశంసలు
  • ఫొటో లీక్‌పై రాజకుటుంబ ఏజెన్సీ తీవ్ర అసంతృప్తి
జపాన్ యువరాణి కాకోకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బ్రెజిల్ పర్యటనలో భాగంగా ఆమె ఒక సాధారణ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తూ అలసటతో నిద్రలోకి జారుకున్న దృశ్యం నెట్టింట వైరల్ అయింది. చక్రవర్తి నరుహిటో మేనకోడలైన ఆమె నిరాడంబరతను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, ఈ ఫొటో లీక్ కావడంపై జపాన్ రాజకుటుంబ వ్యవహారాల విభాగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

జపాన్, బ్రెజిల్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు యువరాణి కాకో (30) ప్రస్తుతం దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఒకే రోజు నాలుగు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం, సావో పాలో నుంచి కాంపో గ్రాండేకు వెళ్లేందుకు ఇతర ప్రయాణికులతో కలిసి సాధారణ కమర్షియల్ విమానం ఎక్కారు. రోజంతా తీరిక లేకుండా గడపడంతో తీవ్రంగా అలసిపోయిన ఆమె, విమానంలో తన సీటులో కిటికీకి ఆనుకుని గాఢ నిద్రలోకి జారుకున్నారు.

ఈ సమయంలో తోటి ప్రయాణికుడు తీసిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. రాజకుటుంబానికి చెందిన వ్యక్తి ఎంతో నిరాడంబరంగా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం, సాధారణ వ్యక్తిలా అలసిపోయి నిద్రపోవడం అందరినీ ఆకట్టుకుంది. "ఆమె ఒక పింగాణీ బొమ్మలా ఉన్నారు, ఇంత బిజీ షెడ్యూల్‌లో అలసిపోవడం సహజమే" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, "ఆమె వినయం, నిరాడంబరతకు ఈ ఫొటో నిదర్శనం" అని మరొకరు ప్రశంసించారు.

అయితే, సోషల్ మీడియాలో యువరాణికి ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, రాజకుటుంబ వ్యవహారాలను పర్యవేక్షించే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ (IHA) ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించింది. యువరాణి వ్యక్తిగత సమయాల్లో అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఏజెన్సీ ప్రతినిధి నయోమాసా యోషిదా స్పష్టం చేశారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అన్నారు. ఈ వీడియో కంపెనీ మార్గదర్శకాలను ఉల్లంఘించిందా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని కోరుతూ తాము సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది.

గతంలో యువరాణి కాకో అక్క, ప్రిన్సెస్ మాకో, తన కాలేజీ స్నేహితుడిని వివాహం చేసుకునేందుకు రాజరిక హోదాను వదులుకుని రాజకుటుంబం నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజకుటుంబ కార్యక్రమాల్లో యువరాణి కాకో కీలక పాత్ర పోషిస్తున్నారు. తన అందం, వినయంతో జపాన్ ప్రజల మన్ననలు పొందుతున్న ఆమెను అక్కడి మీడియా "జపాన్ ఆశాకిరణం"గా అభివర్ణిస్తుంటుంది.

Princess Kako
Japan Princess
Kako Brazil
Japanese Royalty
Economy Class
Royal Family
Imperial Household Agency
Princess Mako
Japan Brazil Relations

More Telugu News