Young Man Spoon: మత్తులో చెంచా మింగాడు.. కలలో జరిగిందనుకుని ఆరు నెలలు మర్చిపోయాడు!

Man Swallows Spoon Drunk Forgets For 6 Months
  • వేరే సమస్యతో ఆస్పత్రికి వెళ్తే బయటపడిన అసలు నిజం
  • చిన్న ప్రేగులో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఇరుక్కున్న చెంచా
  • 90 నిమిషాల ఎండోస్కోపీ ప్రక్రియతో విజయవంతంగా తొలగించిన వైద్యులు
మద్యం మత్తులో మనుషులు చేసే పనులు కొన్నిసార్లు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడతాయి. చైనాకు చెందిన ఓ యువకుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. మద్యం మత్తులో ఏకంగా 15 సెంటీమీటర్ల పొడవైన చెంచాను మింగేసి, ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అదంతా కలలో జరిగిందని భావించి, దాదాపు ఆరు నెలల పాటు కడుపులోనే ఆ చెంచాతో జీవించాడు. చివరకు వేరే ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా, ఈ షాకింగ్ విషయం బయటపడింది.

‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం యాన్ అనే 29 ఏళ్ల చైనా యువకుడు కొన్ని నెలల క్రితం థాయ్‌లాండ్‌లో పర్యటించాడు. అక్కడి ఓ హోటల్ గదిలో మద్యం తాగిన అతడు వాంతి చేసుకోవడానికి కాఫీ చెంచాను ఉపయోగించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అది జారి గొంతులోకి వెళ్లిపోయింది. మద్యం మత్తులో ఉండటంతో స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు ఉదయం మేల్కొన్న తర్వాత జరిగినదంతా ఓ పీడకలగా భావించాడు. వాంతులు చేసుకోవడం వల్లే కడుపునొప్పి వచ్చిందని సరిపెట్టుకున్నాడు.

ఆరు నెలల పాటు యాన్ తన కడుపులో చెంచా ఉన్న విషయం తెలియకుండానే సాధారణ జీవితం గడిపాడు. రోజూ వ్యాయామాలు కూడా చేసేవాడు. ఇటీవల షాంఘైలో తాను టేక్‌అవే ఫుడ్ ప్యాకెట్‌లోని ప్లాస్టిక్ ముక్కను మింగాననే అనుమానంతో వైద్యులను సంప్రదించాడు. వైద్యులు పరీక్షలు చేయగా, అతని చిన్న ప్రేగులో 15 సెంటీమీటర్ల చెంచా ఇరుక్కుని ఉండటం చూసి నివ్వెరపోయారు. అది అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉందని, కొంచెం కదిలినా అంతర్గత రక్తస్రావం లేదా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడే యాన్‌కు థాయ్‌లాండ్‌లో జరిగిన ఘటన గుర్తొచ్చింది.

ఈ నెల 18న షాంఘైలోని ఝాంగ్‌షాన్ ఆస్పత్రి వైద్యులు అతనికి చికిత్స ప్రారంభించారు. చెంచా ఉపరితలం జారుడుగా ఉండటం, అది ఇరుక్కుపోయిన ప్రదేశం కారణంగా దాన్ని బయటకు తీయడం సవాలుగా మారింది. వైద్యులు సుమారు 90 నిమిషాల పాటు శ్రమించి, రెండు ఫోర్సెప్స్‌లతో కూడిన ప్రత్యేక ఎండోస్కోపీ పద్ధతి ద్వారా ఆ చెంచాను ముందుగా జీర్ణాశయంలోకి లాగి, ఆ తర్వాత విజయవంతంగా బయటకు తీశారు. ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. యాన్ ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనుకోకుండా ఈ విషయం బయటపడి తన ప్రాణాలు నిలిచినందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.

మద్యం మత్తులో వింత పనులు చేయడం కొత్తేమీ కాదు. గతవారం హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ వ్యక్తి మద్యం మత్తులో ఒంటెపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ ఒంటెను ఆపి, ఆ వ్యక్తిపై నీళ్లు చల్లి, ఒంటెను దగ్గరలోని విద్యుత్తు స్తంభానికి కట్టేసి ప్రమాదాన్ని నివారించాడు.
Young Man Spoon
China
Thailand
Drunkenness
Surgery
Hospital
Shanghai
PV Narasimha Rao Expressway

More Telugu News