Bangalore rent: అద్దె ఇంటికి 19 లక్షలు డిపాజిటా..? బెంగళూరులో ఇంటి అద్దెలపై కెనడా పౌరుడి ఆశ్చర్యం

Bangalore Rent Crisis Canadian Citizen Reacts to High Deposits
  • రూ.1.75 లక్షల అద్దె.. బెంగళూరు హౌస్ ఓనర్ల డిమాండ్లపై చర్చ
  • బెంగళూరులో అద్దెలు ఓ మాఫియా అంటూ నెటిజన్ల ఆగ్రహం
  • ఈ కారణంగానే నగరానికి వచ్చే ఆలోచన మానుకున్నామన్న పలువురు
బెంగళూరులో ఇంటి అద్దెలు, యజమానులు అడిగే అడ్వాన్స్ లపై కెనడా పౌరుడు ఒకరు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు చూసి నెటిజన్లు సైతం నివ్వెరపోతున్నారు. భారత్‌లో నివసిస్తున్న కాలేబ్ ఫ్రైసెన్ అనే కెనడా పౌరుడు, బెంగళూరులోని డోమ్లూర్ డైమండ్ డిస్ట్రిక్ట్‌లో అద్దెకు ఉన్న ఓ 3బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ వివరాలను 'ఎక్స్' (ట్విట్టర్) లో పంచుకున్నారు. దాని నెలవారీ అద్దె రూ.1.75 లక్షలు కాగా, సెక్యూరిటీ డిపాజిట్‌గా ఏకంగా రూ.19.25 లక్షలు చెల్లించాలని ఉండటంతో ఆయన షాక్ అయ్యారు.

"సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ.19 లక్షలా! ఈ రోజుల్లో ఇంటి యజమానుల గొంతెమ్మ కోరికలు చూస్తే పిచ్చెక్కిపోతోంది. ఈ డిపాజిట్ కంటే తక్కువ ధరకే కొత్త మహీంద్రా థార్ కారు కొనవచ్చు" అంటూ కాలేబ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఇందిరానగర్ పరిసరాల్లో 2-3 నెలల డిపాజిట్‌తో రూ.80 వేల నుంచి రూ.1 లక్ష మధ్య అద్దెకు ఇల్లు ఏమైనా ఉందా అని ఆయన నెటిజన్లను అడిగారు.

ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పెద్ద చర్చకు దారితీసింది. "ఈ నగరంలో ఇల్లు అద్దెకు తీసుకోవడం ఓ మాఫియా" అని ఒకరు కామెంట్ చేయగా, "ఈ భారీ డిపాజిట్ల వల్లే బెంగళూరుకు మారాలనే ఆలోచన విరమించుకున్నాను" అని మరొక యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ అడ్వాన్స్‌తో ఒక కిడ్నీ కొనవచ్చంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందించారు. ఈ ఘటన బెంగళూరులో సామాన్యులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అద్దె కష్టాలకు అద్దం పడుతోంది.
Bangalore rent
rental deposit
3BHK apartment
Caleb Friesen
Domlur Diamond District
India real estate
housing crisis
Mahindra Thar
Indiranagar
property prices

More Telugu News