Priyanka Gandhi: ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు.. రెండుచోట్ల ఆప్, చెరో చోట కాంగ్రెస్, టీఎంసీ లీడ్

  • నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • కేరళలోని నీలాంబూరులో తొలి ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
  • 2007 తర్వాత విసావదర్ స్థానాన్ని గెలుచుకోని బీజేపీ
  • గుజరాత్‌లో రెండు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు

నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. గుజరాత్‌లోని విసావదర్, కడి స్థానాలతో పాటు పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కాళీగంజ్, కేరళలోని నీలాంబూరు నియోజకవర్గాలకు జూన్ 19న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వెలువడుతున్న తొలి ఫలితాల సరళి ప్రకారం కేరళలోని నీలాంబూరు స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మోహన్ జార్జ్, సీపీఎం అభ్యర్థి ఎం. స్వరాజ్ వెనుకంజలో ఉన్నారు. విసావదర్, లుధియానాలో ఆప్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, కాళీగంజ్‌లో టీఎంసీ అభ్యర్థి లీడ్‌లో ఉన్నారు.

ఈ ఉప ఎన్నికలను అధికార ఎన్డీయే కూటమితో పాటు విపక్ష ఇండియా కూటమి కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలు ఒకరకంగా దిక్సూచిగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేరళలో ప్రియాంక గాంధీకి ప్రతిష్ఠాత్మకం
కేరళలోని నీలాంబూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ స్థానం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక ఇక్కడ రోడ్‌షో కూడా నిర్వహించారు. గతంలో లెఫ్ట్ మద్దతుతో రెండుసార్లు గెలిచిన ఓవీ అన్వర్ కాంగ్రెస్‌ వైపు మారడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఎం.స్వరాజ్‌ను, కాంగ్రెస్ మద్దతుగల యూడీఎఫ్ ఆర్యదన్ షౌకత్‌ను, బీజేపీ అడ్వకేట్ మోహన్ జార్జ్‌ను బరిలోకి దించాయి. ఇక్కడ అత్యధికంగా 73.26 శాతం పోలింగ్ నమోదైంది.

గుజరాత్‌లో రెండు స్థానాలు
గుజరాత్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. విసావదర్ అసెంబ్లీ స్థానాన్ని 2007 నుంచి బీజేపీ గెలుచుకోలేకపోయింది. 2023లో అప్పటి ఆప్ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్, కాంగ్రెస్ నుంచి నితిన్ రాన్‌పరియా, ఆప్ నుంచి మాజీ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా పోటీ పడ్డారు.

ఇక కడి స్థానం మెహసానా జిల్లా పరిధిలో ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి ఫిబ్రవరిలో మరణించడంతో ఉప ఎన్నిక అవసరమైంది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డా, కాంగ్రెస్ నుంచి రమేశ్ చావ్డా, ఆప్ నుంచి జగదీష్ చావ్డా బరిలో నిలిచారు.

బెంగాల్.. పంజాబ్‌లలో హోరాహోరీ
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా పరిధిలోని కాళీగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహమద్ ఫిబ్రవరిలో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలిఫా అహమద్ టీఎంసీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా ఆశిష్ ఘోష్, సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా కబిల్ ఉద్దీన్ షేక్ పోటీ పడుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్, బీజేపీ మధ్య ఈ ఉప ఎన్నిక కీలక పోరుగా మారింది.

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్మీత్ బస్సీ గోగి జనవరిలో స్వయంగా కాల్చుకుని మరణించడంతో ఖాళీ అయింది. పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆప్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక్కడ ఆప్ నుంచి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా, బీజేపీ నుంచి జీవన్ గుప్తా, కాంగ్రెస్ సీనియర్ నేత భరత్ భూషణ్ అషు, శిరోమణి అకాలీదళ్ నుంచి పరుప్‌కార్ సింగ్ ఘుమాన్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ అత్యల్పంగా 51.33 శాతం పోలింగ్ నమోదైంది.  

మూడు అసెంబ్లీ స్థానాలు: గుజరాత్‌లోని కడి, బెంగాల్‌లోని కాళీగంజ్, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ - శాసనసభ్యుల మరణాల కారణంగా ఖాళీ కాగా, గుజరాత్‌లోని విసావదర్, కేరళలోని నీలాంబూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాలతో పోలింగ్ అవసరమైంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తుది ఫలితాలు వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
Priyanka Gandhi
Kerala
Nilambur
Bypoll Results 2024
Visavadar
Ludhiana West
Kaliaganj
Gujarat Bypoll
Punjab Bypoll
West Bengal Bypoll

More Telugu News