Nadendla Manohar: తెనాలిలో ఘనంగా యోగా దినోత్సవం.. మంత్రి నాదెండ్ల యోగాసనాలు

Nadendla Manohar Celebrates Yoga Day in Tenali with Yoga Asanas
  • యోగా డే సందర్భంగా తెనాలిలో మెగా యోగా కార్యక్రమం
  • పాల్గొన్న ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
  • ఆరోగ్యానికి యోగా మంచి మార్గమని మంత్రి ఉద్బోధ
  • యోగా గురువులను, వయోవృద్ధులను సన్మానించిన మంత్రి
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మెగా యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై, స్వయంగా యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తి నింపారు.

తెనాలిలో జరిగిన ఈ మెగా యోగా కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ యోగా మాస్టర్ల సూచనల మేరకు వివిధ ఆసనాలను అభ్యసించారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువతీయువకులు ఉదయం 6:30 గంటలకే కార్యక్రమస్థలికి చేరుకుని సుమారు గంటపాటు యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ... "ఆరోగ్యంగా జీవించడానికి, ఔషధాల అవసరం లేకుండా ఉండటానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. యోగా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. ఇది శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది" అని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా యోగా దినోత్సవం విజయవంతమైందని ఈ సంద‌ర్భంగా మంత్రి తెలిపారు. "సీఎం చంద్ర‌బాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం తీసుకురావడానికి గత నెల రోజులుగా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాం. ప్రజల విశేష స్పందనతో ఇది విజయవంతమైంది" అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారని, భారతదేశం నుంచి యోగా ప్రపంచానికి పరిచయం కావడం గర్వకారణమని అన్నారని మంత్రి గుర్తుచేశారు.

తెనాలిలో జరిగిన కార్యక్రమంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు వేయడం, ఇతరులకు ఆదర్శంగా నిలవడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం యోగా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆ త‌ర్వాత‌ శిక్షణ ఇచ్చిన యోగా గురువులను, కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులను మంత్రి ఘనంగా సన్మానించారు. 
Nadendla Manohar
Tenali
Yoga Day
Yoga Andhra
International Yoga Day
Andhra Pradesh
Chandrababu Naidu
Narendra Modi
Yoga Asanas
Health

More Telugu News