Paetongtarn Shinawatra: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన థాయ్ లాండ్ ప్రధాని షినవత్ర

Paetongtarn Shinawatra Apologizes Publicly After Leaked Phone Call
  • పొరుగు దేశ మాజీ ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా
  • ఫోన్ కాల్ లీక్ తో స్వపక్షం నుంచే విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొన్న  పేటోంగ్టార్న్ షినవత్రా
  • ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో క్షమాపణలు చెప్పిన పెంటోగ్టార్న్
పొరుగుదేశం నేతతో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడంతో థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా (38)పై దేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు, వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తుండగా, మరోపక్క సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలో భాగంగా ఆమె దేశ ప్రజలకు, పార్టీలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.

విషయంలోకి వెళితే.. థాయ్‌లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె అయిన పేటోంగ్టార్న్ షినవత్రా గత ఏడాది ఆగస్టులో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. థాయ్‌లాండ్ పొరుగు దేశమైన కంబోడియాతో సరిహద్దు వివాదాల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌కు షినవత్రా ఫోన్ చేసి ఆయనను అంకుల్ అని సంబోధిస్తూ తమ దేశంలోని పరిస్థితులను వివరించడం, థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్ సిన్ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె సంభాషించడం జరిగింది.

జూన్ 15న జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ తాజాగా బయటకు రావడం వివాదాస్పదమైంది. స్వపక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె చర్యతో దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్ జాయ్ థాయ్ పార్టీ వైదొలిగింది. థాయ్ పార్లమెంట్ లో 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో 500 మంది సభ్యులు ఉన్న థాయ్ పార్లమెంట్ లో షినవత్రా కేవలం 254 మంది మద్దతుతో మిగిలింది. ఈ వివాదం నేపథ్యంలో మరో మిత్రపక్షం వైదొలిగితే షినవత్రా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

దీంతో ఆమె ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి బహిరంగ క్షమాపణలు చెప్పారు. శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతోనే తాను ఫోన్ చేసి మాట్లాడానని, ఇకపై హున్ సేన్‌తో ప్రైవేటు సంభాషణలు చేయనని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. 
Paetongtarn Shinawatra
Thailand Prime Minister
Hun Sen
Cambodia
Thailand politics
Phone call controversy
Coalition government
Political crisis
Thailand army
Apology

More Telugu News