Praful Patel: ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్‌లో ప్రయాణించడానికి నేను సిద్ధం: మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్

Praful Patel Ready to Fly on Air India Dreamliner
  • అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఆందోళన అవసరం లేదన్న ప్రఫుల్ పటేల్
  • ఎయిర్ ఇండియా భద్రతా ప్రమాణాలపై పూర్తి విశ్వాసం ఉందన్న మాజీ మంత్రి
  • విమానయాన భద్రత విషయంలో 99.9 శాతం అనేది ఉండదని స్పష్టీకరణ
అహ్మదాబాద్‌లో ఇటీవల ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై విమానయానశాఖ మాజీ మంత్రి ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో ప్రయాణించేందుకు తాను సిద్ధమని, ఇప్పుడంటే ఇప్పుడు ప్రయాణిస్తానని పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎయిర్ ఇండియాకు పటిష్టమైన సాంకేతిక పునాది ఉందని, దేశ విమానయాన నియంత్రణ వ్యవస్థ బలంగా ఉందని పేర్కొన్నారు.  

విమానయాన సంస్థలు, విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నుంచి మెరుగైన సమాచార మార్పిడి అవసరమని, ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని ప్రఫుల్ పటేల్ సూచించారు. విమాన ప్రయాణం విషయంలోనూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రయాణం అనేది 99.9 శాతం సురక్షితం అనేదేమీ ఉండదని.. అయితే 100 శాతం సురక్షితం లేదంటే సున్నా మాత్రేమనని స్పష్టం చేశారు. 

అహ్మదాబాద్ ప్రమాద స్థలాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్‌బీ) బృందం, విమాన తయారీ సంస్థ బోయింగ్, ఇంజిన్ల తయారీ సంస్థ జీఈ ప్రతినిధులు, అలాగే భారతీయ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) అధికారులు తక్షణమే సందర్శించారని, కాబట్టి దర్యాప్తు వేగం సంతృప్తికరంగా ఉందని పటేల్ తెలిపారు. 2004 నుంచి 2011 వరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన తన అనుభవం ప్రకారం ఈ దర్యాప్తు మూడు నెలల్లో పూర్తికావచ్చని, అయితే అన్ని కోణాల్లోనూ పరిశీలించాల్సి ఉన్నందున మరింత సమయం పట్టే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.

దెబ్బతిన్న ఏఐ 171 విమానం బ్లాక్ బాక్స్‌ను భారత్‌లోనే డీకోడ్ చేయగల సామర్థ్యం ఏఏఐబీకి ఉందని, ఒకవేళ అమెరికాలో చేసినా నష్టం లేదని పటేల్ అన్నారు. విమానాలు రద్దవడం లేదా సాంకేతిక సమస్యలు తలెత్తడం ప్రతిరోజూ జరిగేవేనని, తాజా ప్రమాదం వల్ల అవి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు.

"ఎయిర్ ఇండియా యాజమాన్యం ఎవరిదైనా ఎప్పుడూ భద్రతకే పెద్దపీట వేస్తుంది. తయారీదారులు లేదా డీజీసీఏ సూచించిన ప్రతి ప్రక్రియను వారు పాటిస్తారు" అని ప్రఫుల్ పటేల్ తెలిపారు. "భారత్ చాలా మంచి భద్రతా ప్రమాణాలను అనుసరిస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎయిర్ ఇండియా గతంలో కూడా విషాదకరమైన సంఘటనలు, ప్రమాదాలను ఎదుర్కొంది. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆ సమస్యలను అధిగమించగలిగింది. ప్రస్తుత సందర్భంలో కూడా ఎయిర్ ఇండియా ఈ సంక్షోభం నుంచి బయటపడుతుంది" అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Praful Patel
Air India
Boeing 787 Dreamliner
Ahmedabad
DGCA
Aviation Safety
Aircraft Accident Investigation
NTSB
AAIB
Aviation Ministry

More Telugu News