Yashasvi Jaiswal: జైస్వాల్ వ‌ర‌ల్డ్‌ రికార్డు.. బ్రాడ్‌మాన్‌ను వెనక్కి నెట్టిన యువ బ్యాట‌ర్‌!

Yashasvi Jaiswal Surpasses Don Bradman For Historic Feat vs England
  • ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. మొదటి రోజు భారత్ 359/3
  • యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్‌) శతకాలు
  • జైస్వాల్ అరుదైన ఘనత.. ఇంగ్లాండ్‌పై అత్యధిక టెస్టు సగటు
  • డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును అధిగమించిన యశస్వి
ఇంగ్లాండ్‌తో హెడింగ్లీలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్) అద్భుత శతకాలతో చెలరేగగా, వైస్-కెప్టెన్ రిషభ్ పంత్ (65 నాటౌట్) ధనాధన్ అర్ధశతకం న‌మోదు చేశాడు. నిన్న తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. 

జైస్వాల్ శతకం.. వ‌ర‌ల్డ్‌ రికార్డు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఆరంభాన్నిచ్చాడు. కేవలం 159 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులు చేసిన జైస్వాల్, భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. ఈ సెంచరీతో యశస్వి ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో (కనీసం 500 పరుగులు చేసిన వారిలో) అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. 

ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 813 పరుగులు చేసిన జైస్వాల్ 90.33 సగటుతో, ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గ‌జం డాన్ బ్రాడ్‌మాన్ (63 ఇన్నింగ్స్‌లలో 5028 పరుగులు, 89.78 సగటు) రికార్డును అధిగమించాడు. ఇంగ్లాండ్‌పై 90కి పైగా సగటు నమోదు చేసిన తొలి బ్యాటర్ కూడా జైస్వాలే కావడం విశేషం. 

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంత్ దూకుడు
జైస్వాల్ నిష్క్రమణ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎంతో పరిణతితో నిలకడగా బ్యాటింగ్ చేసిన గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో గిల్ టెస్టు క్రికెట్‌లో 2,000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. మరోవైపు రిషభ్ పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడి 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 65 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. పంత్ కూడా ఈ ఇన్నింగ్స్‌లో 3,000 టెస్టు పరుగుల మార్కును అందుకున్నాడు. గిల్, పంత్ జోడీ అజేయంగా నాలుగో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
Yashasvi Jaiswal
Jaiswal century
Shubman Gill
Rishabh Pant
India vs England
India batting
Cricket record
Don Bradman record
Test cricket
Batting average

More Telugu News