Bhupesh Baghel: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం .. అరగంటకుపైగా తెరుచుకోని తలుపులు

Bhupesh Baghel Indigo Flight Door Malfunction Causes Delay in Raipur
  • ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
  • రాయ్ పూర్ లో లాండ్ అయిన తర్వాత విమాన తలుపులు తెరుచుకోని వైనం
  • ఆందోళనకు గురయిన ప్రయాణికులు
  • ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటన విడుదల చేసిన ఇండిగో
గుజరాత్‌లో ఇటీవల చోటుచేసుకున్న విమాన దుర్ఘటన నేపథ్యంలో, విమానాల్లో స్వల్ప సాంకేతిక లోపం తలెత్తినా ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.

నిన్న ఢిల్లీ నుంచి రాయ్‌పూర్ చేరుకున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల విమానం తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు కొంత కలవరానికి గురయ్యారు. ఆ సమయంలో విమానంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాయ్‌పూర్ మేయర్ కూడా ఉన్నారు. చివరికి సిబ్బంది బయటి నుంచి వచ్చి విమానం తలుపులు తెరవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ ఘటనపై స్పందిస్తూ, విమానం ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు ప్రయాణికులు అందులోనే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు. రాయ్‌పూర్ మేయర్ మీనాల్ చౌబే మాట్లాడుతూ, ఈ ఘటనలో ఎలాంటి భయం లేనప్పటికీ, అహ్మదాబాద్ ఘటన తర్వాత చిన్న సమస్య కూడా ఆ విషాదాన్ని గుర్తుకు తెస్తోందని అన్నారు.

ఈ పరిణామంపై ఇండిగో విమానయాన సంస్థ స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం తలుపులు తెరుచుకోలేదని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. 
Bhupesh Baghel
Indigo flight
Raipur
Delhi
flight delay
technical issue
Chhattisgarh
Minal Choubey
airport
plane malfunction

More Telugu News