Viral Video: 93 ఏళ్ల వృద్ధుడి ప్రేమకు జ్యువెలరీ షాపు యజమాని ఫిదా.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

93 Year Olds Love For His Wife And A Jewellery Shops Priceless Gesture
  • 93 ఏళ్ల వృద్ధుడు భార్యకు మంగళసూత్రం కొనేందుకు నగల దుకాణానికి వెళ్లిన వైనం
  • వృద్ధుడి ప్రేమకు ముగ్ధుడైన షాపు యజమాని
  • కేవలం 20 రూపాయలు తీసుకుని మంగళసూత్రం అందజేత
  • జాల్నా జిల్లాకు చెందిన నివృత్తి షిండే, శాంతాబాయి దంపతుల పాదయాత్రలో చోటుచేసుకున్న ఘటన
  • ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరీపురం యాత్ర చేస్తున్న వృద్ధ జంట
వయసు పైబడినా ఒకరిపై ఒకరికి తరగని ప్రేమకు నిదర్శనంగా నిలిచింది ఓ వృద్ధ జంట. 93 ఏళ్ల భర్త తన భార్య కోసం మంగళసూత్రం కొనడానికి నగల దుకాణానికి వెళ్లగా, వారి అన్యోన్యతకు ఫిదా అయిన‌ దుకాణ యజమాని నామమాత్రపు ధరకు దానిని అందించిన ఘటన అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అంబోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృత్తి షిండే (93), ఆయన భార్య శాంతాబాయి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరీపురానికి కాలినడకన యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇటీవల ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ నగల దుకాణానికి వెళ్లారు. సంప్రదాయ పంచె, కుర్తా, తలపాగా ధరించిన నివృత్తి షిండే, ఆయన భార్యను చూడగానే దుకాణ సిబ్బంది పొరబడ్డారు. వారి వేషధారణ చూసి ఏదైనా ఆర్థిక సహాయం కోసం వచ్చారేమోనని భావించారు.

అయితే, నివృత్తి షిండే తన భార్యకు మంగళసూత్రం కొనాలని ఉందని చెప్పడంతో దుకాణ సిబ్బందితో పాటు యజమాని కూడా ఆశ్చర్యపోయారు. ఆ వయసులో భార్యపై ఆయనకున్న ప్రేమకు చలించిపోయారు. షిండే తన వద్ద ఉన్న 1,120 రూపాయలను యజమానికి అందించి, తన భార్యకు మంగళసూత్రం కావాలని కోరారు. ఆ వృద్ధుడి నిష్కల్మషమైన ప్రేమకు, వారి దాంపత్య బంధానికి అబ్బురపడిన దుకాణ యజమాని, వారి నుంచి కేవలం 20 రూపాయలను మాత్రమే తీసుకుని, మంగళసూత్రాన్ని వారికి బహుమతిగా అందించారు.

"ఆ దంపతులు దుకాణంలోకి వచ్చారు. వృద్ధుడు నా చేతిలో 1,120 రూపాయలు పెట్టి, తన భార్యకు మంగళసూత్రం కావాలని అడిగారు. ఆయన ప్రేమ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వారి ఆశీస్సుల కోసం కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుని, మంగళసూత్రాన్ని వారికి అందజేశాను" అని గోపికా జ్యువెలరీ షాపు యజమాని తెలిపారు.

ఈ హృద్యమైన దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా వ్యూస్ తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. 
Viral Video
Nivrutti Shinde
old couple love
jewelry shop
Mangalsutra
Maharashtra
jalna district
Ashadi Ekadashi
Pandharpur
traditional couple

More Telugu News