Farmer Suicides Andhra Pradesh: పల్నాడులో తీవ్ర విషాదం .. ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య

Farmer Suicides Andhra Pradesh 3 Farmers Commit Suicide in Palanadu Due to Debt
  • వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ప్రాణాలు తీసుకున్న కౌలు రైతులు
  • పురుగు మందు తాగి ఇద్దరు, ఉరివేసుకుని ఒకరు మృతి చెందిన వైనం
  • బాధిత కుటుంబాలను పరామర్శించిన ఉన్నతాధికారులు
పల్నాడు జిల్లాలో నిన్న ముగ్గురు కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో నాదెండ్ల మండలానికి చెందిన ఇద్దరు, ఈపూరు మండలానికి చెందిన ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

నాదెండ్ల గ్రామానికి చెందిన నాశం ఆదినారాయణ (48)కు 1.25 ఎకరాల సొంత పొలం ఉండగా, మరో 40 నుంచి 50 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, శనగ సాగు చేసేవారు. గత నాలుగేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.50 లక్షల వరకూ అప్పులు పెరిగాయి. వీటిని తీర్చే మార్గం లేకపోవడంతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య వెంకట రమణ ఉన్నారు. వారికి పిల్లలు లేరు.

ఇదే మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన శిరిబోయిన గోపాలరావు (41) అనే రైతుకు 30 సెంట్ల పొలం ఉండగా, 15 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, నల్లబర్లీ పొగాకు సాగు చేశారు. గత నాలుగేళ్లుగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు పెరిగిపోయాయి. గ్రామంలోని ఎరువుల దుకాణ యజమాని శిరిబోయిన వెంకటేశ్వర్లు వద్ద ఎరువులు, పురుగు మందుల కోసం రూ.4.60 లక్షల వరకు అప్పు చేశారు. ఇందులో రూ.3 లక్షల వరకు తన ట్రాక్టర్‌తో వెంకటేశ్వర్లుకు చెందిన పొలాలు దున్ని పెట్టారు. అయినా అప్పు చెల్లించలేదని గోపాలరావు ట్రాక్టర్‌ను దుకాణ యజమాని తీసుకువెళ్లారు. దీంతో మనస్తాపం చెందిన గోపాలరావు పొలానికి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆత్మహత్య చేసుకున్న ఆదినారాయణ, గోపాలరావు కుటుంబాలను వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు నిన్న సాయంత్రం పరామర్శించారు. రైతుల ఇంటికి వెళ్లి వారి భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరుగుతుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

కాగా, ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య (52) గత ఏడాది ఆరు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మిరప, పొగాకు, వరి సాగు చేశారు. దిగుబడులు తగ్గి, గిట్టుబాటు ధర లభించక అప్పుల పాలయ్యారు. ఆ అప్పులు తీర్చే దారి లేక పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొండయ్యకు భార్య కోటేశ్వరమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
Farmer Suicides Andhra Pradesh
Palanadu Farmers
Andhra Pradesh Farmers
Agricultural Debt
Crop Failure
Kouli Rythulu
Delhi Rao
AP Agriculture
P Arunkumar
Farmer Distress

More Telugu News