Stock Markets: యుద్ధ భయాలు... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Markets Close Lower Amid War Fears
  • ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న యుద్ధ వాతావరణం
  • టెహ్రాన్‌ను ఖాళీ చేయాలన్న ట్రంప్ సూచనతో పెరిగిన ఆందోళన
  • 212 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని చూపాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయన్న సంకేతాలు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరవచ్చనే భయాలు మార్కెట్లను కుదిపేశాయి. టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ పౌరులకు సూచించినట్లు వచ్చిన వార్తలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు విస్తృతంగా వ్యాపించాయి. దీనికి తోడు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం కూడా సూచీల పతనానికి దోహదపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 81,869 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఆ సానుకూలత ఎక్కువసేపు నిలవలేదు. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ, రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రా-డేలో 81,427 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరికి 212 పాయింట్ల నష్టంతో 81,583 వద్ద స్థిరపడింది. మరోవైపు, నేషనల్ స్టాక్ నిఫ్టీ కూడా 93 పాయింట్లు కోల్పోయి 24,853 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.24గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 74.28 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఒక ఔన్సుకు 3405 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
Stock Markets
Sensex
Nifty
Indian Stock Market
Israel Iran Conflict
Global Market
Share Market
Stock Market News
Market Volatility
Crude Oil Prices

More Telugu News