father's day: ఫాదర్స్ డే రోజే విషాదం.. కన్నబిడ్డల కోసం ప్రాణత్యాగం చేసిన తండ్రి

Father Dies Saving Children at Fort Lauderdale Beach
  • పిల్లలను కాపాడడం కోసం సముద్రంలో దూకిన తండ్రి
  • ఇద్దరు పిల్లల్ని రక్షించి తాను ప్రాణాలు కోల్పోయిన వైనం
  • ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌లో ఘటన.. మృతుడు 33 ఏళ్ల ఆంట్వోన్ విల్సన్‌గా గుర్తింపు
ఫాదర్స్ డే రోజున ఓ తండ్రి తన పిల్లల కోసం చేసిన త్యాగం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అమెరికాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌లో ఈ నెల 15న ఈ విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న తన ఇద్దరు పిల్లలను కాపాడేందుకు వెళ్లిన 33 ఏళ్ల ఆంట్వోన్ విల్సన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

ఆదివారం విల్సన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి వారాంతంలో సరదాగా గడిపేందుకు ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతూ తన ఇద్దరు పిల్లలు మునిగిపోతుండడం గమనించి విల్సన వెంటనే స్పందించాడు. వారిని కాపాడేందుకు నీటిలోకి దూకాడు. సాయంత్రం 7:20 గంటల సమయంలో బీ ఓషన్ రిసార్ట్ సమీపంలో సముద్రంలో ఒకరు మునిగిపోతున్నారంటూ ఫోర్ట్ లాడర్‌డేల్ ఫైర్ రెస్క్యూ విభాగానికి 911 కాల్స్ అందాయి.

ఆ సమయానికి ఓషన్ రెస్క్యూ లైఫ్‌ గార్డులు విధుల్లో లేనప్పటికీ, విషయం తెలిసిన వెంటనే లెఫ్టినెంట్లు ఘటనా స్థలానికి చేరుకున్నారని ఫోర్ట్ లాడర్‌డేల్ ఫైర్ రెస్క్యూ బెటాలియన్ చీఫ్ డేనియల్ మోరన్ తెలిపారు. "లైఫ్‌ గార్డులు వచ్చి కూతురును బయటకు తీసేంత వరకు విల్సన్ ఆమెను నీటిపై తేలియాడేలా పట్టుకున్నాడు" అని మోరన్ చెప్పారు.

ఈ సమయంలో అక్కడ ఉన్న ఎస్లామ్ సాద్ అనే వ్యక్తి కూడా పిల్లలను కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లారు. ఆ పాపను ఒడ్డుకు తీసుకువస్తుండగా రెస్క్యూ సిబ్బంది పాపను తీసుకున్నారని ఆయన వివరించారు.

అయితే, పిల్లలను కాపాడిన విల్సన్ మాత్రం నీటి అడుగుకు వెళ్లిపోయి, తిరిగి పైకి రాలేదు. అధికారులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టి కొద్దిసేపటికే నీటి అడుగున గుర్తించారు. ఒడ్డుకు తీసుకొచ్చాక ప్రథమ చికిత్స అందించినప్పటికీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విల్సన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
father's day
drowning
child rescue
Antwon Wilson
Fort Lauderdale beach
ocean rescue
Florida
Esllam Saad
fatherhood
sacrifice

More Telugu News