Iran-Israel Conflict: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల‌ను ఖండించిన 21 ముస్లిం దేశాలు

21 Arab Muslim nations condemn Israeli strikes on Iran
  • ఈజిప్ట్ చొరవతో 21 అరబ్, ముస్లిం దేశాలు నిన్న‌ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల 
  • ప్రాంతీయంగా ఉద్రిక్తతలు తగ్గించి, వివక్ష లేని అణ్వస్త్ర నిరాయుధీకరణ చేపట్టాలని డిమాండ్
  • అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని హితవు 
  • ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆపాలని, సమగ్ర కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చాయి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను 21 అరబ్, ముస్లిం దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రాంతీయంగా ఉద్రిక్తతలను తగ్గించాలని, ఎలాంటి వివక్ష లేకుండా అణ్వస్త్ర నిరాయుధీకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఆ దేశాలు పిలుపునిచ్చాయి. ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ చొరవతో పలు దేశాల విదేశాంగ మంత్రులతో జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ ప్రకటన వెలువడిందని ఈజిప్టు అధికారిక వార్తా సంస్థ 'మెనా' వెల్లడించింది.

ఈ ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేసిన దేశాల్లో తుర్కియే, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), పాకిస్థాన్, బహ్రెయిన్, బ్రూనై, చాద్, గాంబియా, అల్జీరియా, కొమొరోస్, జిబౌటి, సౌదీ అరేబియా, సూడాన్, సోమాలియా, ఇరాక్, ఒమన్, ఖతార్, కువైట్, లిబియా, ఈజిప్ట్, మౌరిటానియా ఉన్నాయి. ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులను అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని విదేశాంగ మంత్రులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

జాతీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, మంచి పొరుగు సంబంధాల సూత్రాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను ఈ ప్రకటనలో వారు నొక్కి చెప్పారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రస్తుత ప్రమాదకరమైన ఉద్రిక్తతల పట్ల మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ తన శత్రుత్వ చర్యలను తక్షణమే నిలిపివేయాలని వారు పిలుపునిచ్చారు.
Iran-Israel Conflict
Israel
Muslim countries condemn Israel
Middle East tensions
Arab countries
Israel attacks Iran
Regional security
Nuclear disarmament
International law
Egypt

More Telugu News